
ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు విదేశాల్లో మృతి చెందుతూనే ఉన్నారు. స్థానికుల అహంకార తూటాలకు ఎన్నో ఆశలతో వెళ్లిన వాళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పై చదువుల కోసం వెళ్లిన ఇండియన్ స్టూడెంట్ కెనడాలో తుపాకుల తుటాలకు బలయ్యింది. హర్‌సిమ్రత్ రంధవా (21) అనే విద్యార్థిని హోమిల్టన్‌లో బస్ స్టాప్ లో వేచి ఉన్న సమయంలో దుండగుల కాల్పుల్లో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన.
హర్‌సిమ్రత్ రంధవా హోమిల్టన్ లోని మోహాక్ కాలేజీలో చదువుతోంది. బస్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కారులో వచ్చిన దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని భారతీయ కాన్సులేట్ జనరల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హామిల్టన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. బాధితురాలి కుటుంబంతో టచ్ లో ఉన్నామని.. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
స్థానిక సమయం ప్రకారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధిలో కాల్పులు జరిగినట్లు హామిల్టన్ పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి, ఛాతీపై తుపాకీ గాయంతో రాంధావా కనిపించారని.. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్ స్టాప్ దగ్గర ఉన్న వైట్ సెడాన్ పై సడెన్ గా బ్లాక్ సెడాన్ లో వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ మిస్ ఫైర్ అవ్వడంతో అక్కడే ఉన్న రంధవా బుల్లెట్ తగిలి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.