ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌లో భారత వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఖర్కివ్‌లో ఈరోజు ఉదయం జరిగిన రష్యా బాంబు దాడిలో ఒక ఇండియన్ స్టూడెంట్ చనిపోయాడు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ అరిందం బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. మృతుడిని కర్ణాటకలోని హవేరి జిల్లా చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్పగా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం సూపర్‌ మార్కెట్‌ ముందు నవీన్ ఉండగా బాంబు దాడి జరిగింది. తీవ్రగాయాలతో నవీన్‌ మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. రెండ్రోజులుగా ఖార్కివ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇంకా ఖర్కివ్‌లోనే పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. రష్యన్ బలగాల దాడితో భారతీయ విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఖార్కివ్‌లో 4వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. వారంతా ప్రాణ భయంతో బంకర్లలోనే తలదాచుకున్నారు. 

రష్యా, ఉక్రెయిన్ రాయబారులకు నోటీసులు

ఈ ఘటనపై ఢిల్లీలో ఉన్న ఉక్రెయిన్, రష్యా రాయబారులను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పిలిపించుకుని మాట్లాడనున్నట్లు బాగ్చి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్క భారతీయుడినీ అత్యంత వేగంగా ఇండియాకు చేర్చాలన్న డిమాండ్‌ను ఆ రెండు దేశాల రాయబారుల ముందు ఉంచనున్నట్లు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌లలో ఉన్న భారత రాయబారులు కూడా ఈ విషయంపై అక్కడి విదేశాంగ శాఖను డిమాండ్ చేస్తారని అన్నారు.