కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య.. బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తుండగా ఘోరం

కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య.. బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తుండగా ఘోరం
  •  ఓ కారుపై కాల్పులు జరిపిన దుండగుడు
  • మిస్‌‌‌‌‌‌‌‌ ఫైర్  అయి యువతికి తగిలిన బుల్లెట్

ఒట్టావా: కెనడాలో భారతీయ విద్యార్థిని ఒకరు అనూహ్య రీతిలో చనిపోయారు. ఓ కారుపై దుండగుడు కాల్పులు జరపగా.. బుల్లెట్‌‌‌‌‌‌‌‌ పొరపాటున బస్ స్టాప్  వద్ద వెయిట్ చేస్తున్న ఆ విద్యార్థినికి తగిలింది. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం ఒంటారియోలోని హామిల్టన్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. పంజాబ్‌‌‌‌‌‌‌‌లోని తారన్ జిల్లా ధుండా గ్రామానికి చెందిన హర్‌‌‌‌‌‌‌‌సిమ్రత్ రంధావా (21).. ఉన్నత చదువుల కోసం రెండేండ్ల క్రితం కెనడాకు వెళ్లారు.

 ప్రస్తుతం హామిల్టన్‌‌‌‌‌‌‌‌లోని మోహాక్ కాలేజీ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్నారు. బుధవారం సాయంత్రం అప్పర్ జేమ్స్ స్ట్రీట్ అండ్ సౌత్ బెండ్ రోడ్ ఏరియాలో బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో కారులో వచ్చిన ఓ దుండగుడు.. బస్ స్టాప్ వద్ద ఆగి ఉన్న మరో కారులోని వ్యక్తి పైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ పొరపాటున హర్‌‌‌‌‌‌‌‌సిమ్రత్ ఛాతీకి తగిలింది. 

వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారవగా.. తీవ్రంగా గాయపడిన హర్​సిమ్రత్​ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కాల్పులతో హర్‌‌‌‌‌‌‌‌సిమ్రత్ కు ఎలాంటి సంబంధంలేదని.. ఆమె అమాయకురాలని తెలిపారు. బుల్లెట్లు హర్‌‌‌‌‌‌‌‌సిమ్రత్ శరీరం నుంచి చొచ్చుకెళ్లి.. సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లాయని చెప్పారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

అవసరమైన సాయం చేస్తం..

ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది."హామిల్టన్‌‌‌‌‌‌‌‌లో భారతీయ విద్యార్థిని హర్‌‌‌‌‌‌‌‌సిమ్రత్ రంధావా మృతి పట్ల మేం దిగ్భ్రాంతి చెందాం. ప్రస్తుతం ఆమె హత్యపై దర్యాప్తు జరుగుతోంది. మేం మృతురాలి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అవసరమైన సాయాన్ని అందిస్తాం" అని ట్వీట్ చేసింది.