పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అర్థాంతరంగా తనువు చాలించాడు. ఇంటి అద్దె సమస్యపై కొంతమంది భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకొని కత్తి పోట్లకు బలయ్యాడు. ఈ ఘటనలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఇద్దరు సోదరులు అభిజీత్ (26), రాబిన్ గార్టన్ (27)లను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
చనిపోయిన విద్యార్థిని కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన 22 ఏళ్ల నవజీత్ సంధుగా పోలీసులు గుర్తించారు. నవజీత్ సంధు నవంబర్ 2022లో స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళాడు. అతను మెల్‌బోర్న్‌లో MTech డిగ్రీ చదువుతున్నాడు. నిందితులు కూడా మెల్‌బోర్న్‌లో నివసిస్తున్నారు. ఆర్థిక గొడవల కారణంగానే తమ కుమారుడిపై ఈ దాడి జరిగిందని సంధు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ దాడిలో సంధు స్నేహితుడు శ్రవణ్‌కి కూడా గాయాలైనట్లు సమాచారం.
ఆదివారం(మే 05) తెల్లవారుజామున 1:00 గంటలకు ఒర్మాండ్స్ నార్త్ రోడ్‌లో జరిగిన సంఘటన గురించి తమకు కాల్ వచ్చిందని విక్టోరియా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, సంధు మృతదేహాన్ని వీలైనంత త్వరగా తీసుకురావడానికి సహకరించాలని మృతుని బంధువులు భారత ప్రభుత్వాన్ని కోరారు.