క్యాంపులో జోరుగా.. హుషారుగా: చైనా నుంచి వచ్చిన మనోళ్ల వీడియో

క్యాంపులో జోరుగా.. హుషారుగా: చైనా నుంచి వచ్చిన మనోళ్ల వీడియో

నిన్న మొన్నటి వరకు ప్రాణాంతక కరోనా వైరస్ ప్రబలిన చైనా సిటీ వుహాన్ లో బిక్కుబిక్కుమంటూ బతికారు. బయటకు వెళ్తే ఎక్కడ వైరస్ బారిన పడుతామోనని బందీల్లా గడపదాటకుండా గడిపారు. కనీసం వ్యాక్సిన్ కూడా లేని ఈ మహమ్మారి నుంచి తప్పించుకుని ఇంటికి ఎలా చేరాలో కూడా తెలియక భయంతో వణికిపోయారు.

భారత ప్రభుత్వ నిరంతర కృషి ఫలితంగా చైనా మనోళ్లను ఆ దేశం దాటనిచ్చింది. వాళ్లను ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తీసుకొచ్చేందుకు అంగీకరించింది. దీంతో చైనాలో చిక్కుకున్న భారత విద్యార్థులు, ఉద్యోగులతో ఎయిరిండియా విమానాలు నిన్న ఢిల్లీకి చేరాయి. వారిని ప్రత్యేకంగా హర్యానాలోని మనేసర్ లో ఉన్న భారత ఆర్మీ క్యాంపులో ఉంచి డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. 15 రోజుల పాటు ఎటువంటి కరోనా లక్షణాలు కనిపనించకపోతే వారిని స్వస్థలాలకు పంపుతారు.

డిసెంబరు నెల చివరి నుంచి చైనాలో భయం భయంగా బతికిన భారత విద్యార్థులు సొంత గడ్డ అడుగు పెట్టాక బోలెడంత రిలీఫ్ ఫీలవుతున్నారు. క్యాంపులో హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ సాంగ్స్ పెట్టుకుని స్టెప్పులేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కష్టం వచ్చిన సమయంలో మానసికంగా ధైర్యంగా ఉండడమే అసలైన పోరాటమని ఓ నెటిజన్ ట్విట్టర్లో కామెంట్ చేశాడు. చైనాలో చిక్కుకున్న పాక్ విద్యార్థులను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తీసుకొచ్చేందుకు తిరస్కరించడంపై సెటైర్లు పేలుస్తున్నారు మరికొందరు నెటిజన్లు.

తోటి విద్యార్థులు చనిపోతుంటే డాన్సులా?

అక్కడ చైనాలో తోటి విద్యార్థులు, టీచర్లు చనిపోతుంటే ఇక్కడ డాన్సులేస్తున్నారా? అంటూ దుబాయ్ కి చెందిన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఆ కామెంట్ ను కొందరు తప్పుబట్టారు. ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డామన్న సర్వైవల్ విక్టరీ సెలబ్రేషన్ అని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. విక్టరీ అనేది మానవత్వంతో ఉండాలని, నేషనలిజం కన్నా హుమ్యానిటీ ముఖ్యమని తొలుత పోస్ట్ చేసిన వ్యక్తి రిప్లై ఇచ్చాడు. దీనిపై స్పందించిన మరో వ్యక్తి..పాక్, కమ్యూనిస్టులకు మానవత్వం లేదన్నాడు. పాకిస్థానీలకు సైతం గతంలో మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అనేక సార్లు సాయం చేశారని, కానీ ఆమె మరణించాక ఆ దేశంలో చాలా మంది వ్యంగ్యంగా కామెంట్లు చేశారని గుర్తు చేశాడు. నాడు ఆమె భారతీయులు అంగారక గ్రహంపై చిక్కుకున్నా సరే ఇండియన్ ఎంబసీ వచ్చి సాయం చేస్తుందంటూ చేసిన ట్వీట్ ను ఆ వ్యక్తి పోస్ట్ చేశాడు.