కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో నగరంలో అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తం అయ్యింది. విద్యార్థులు వసతి గృహాల లోపలే ఉండాలని.. బయటకు రావొద్దని సూచనలు చేసింది. ఇటీవల ఓ హాస్టల్‌లో జరిగిన మూక హింసలో పలువురు పాకిస్థానీ విద్యార్థులు గాయపడ్డారు. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది. 

"మేము భారత విద్యార్థులతో టచ్‌లో ఉన్నాము. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. విద్యార్థులు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం.. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మా నంబర్ 0555710041.." అని  కిర్గిజ్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, కిర్గిజ్‌స్థాన్‌లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు నివసిస్తున్న బిష్కెక్‌లోని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్ల లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ముకహింస దాడిలో ముగ్గురు పాకిస్థానీ విద్యార్థులు చనిపోయారని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు పేర్కొనగా, తమకు ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వం తెలిపింది. మే 13న కిర్గిజ్, ఈజిప్టు విద్యార్థుల మధ్య జరిగిన పోరు వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో విషయం తీవ్రమైందని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ప్రకటన చేసింది.

ఈ మూక హింసపై కిర్గిజ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులను, కిర్గిస్థాన్‌ పౌరులను అదుపులోకి తీసుకోవడానికి సైన్యం సత్వర చర్యలు చేపట్టాయని వెల్లడించింది.