
US News: ఇట్ల ఇండియాలో బీటెక్ చేసినమా.. ఎంఎస్ చేసేందుకు అమెరికాలో ఏదైనా కాలేజీలో సీటు కొట్టినమ అన్నదే నేటి యూత్ ప్లాన్. దీనికి కారణం అమెరికాపై ప్రజల్లో రోజురోజుకూ పెరిగుతున్న మోజే. అగ్రరాజ్యంలో తమ పిల్లలు రాజులా బతకాలనేది చాలా మంది భారతీయ తల్లిదండ్రుల కల. దీనికోసం ఎన్ని లచ్చలైనా సొమ్ము అప్పు తెచ్చి అమెరికా పంపేందుకు కూడా పేరెంట్స్ వెడకాడటం లేదు. కానీ ఈ ముచ్చట్లు ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు ట్రంప్ కింద అస్సలు నడవట్లే. ఇప్పటికే డిపోర్టేషన్ స్టార్ట్ చేసిన ట్రంప్ మామ.. అక్రమ వలసదారుల తర్వాత అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులపై గురిపెట్టారని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ అధికారులు అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలకు వారి విద్యార్థులకు సంబంధించిన పేర్లు, వారు ఏ దేశం నుంచి వచ్చారు వంటి సమాచారాన్ని సేకరిస్తున్నరు. ఇది వలసదారులతో పాటు న్యాయ నిపుణులను సైతం అప్రమత్తం చేస్తోంది. వాస్తవానికి ఇది విద్యార్థులను డిపోర్ట్ చేసేందుకు ట్రంప్ సర్కార్ చేస్తున్న చర్యగా కొందరు అనుమానిస్తున్నారు. ట్రంప్ తన మెుదటి టర్మ్ సమయంలో కూడా కొందరు విద్యార్థులను ఇలాంగే వారి దేశాలకు పంపేయగా భారతీయులు సైతం అప్పట్లో కొందరు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
Also Raed : 80% పెరగనున్న జున్‌జున్‌వాలా స్టాక్
దీంతో ప్రస్తుతం అమెరికా కాలేజీల్లో ఉన్న 3 లక్షల 30 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొలంబియాకు చెందిన రంజని శ్రీనివాసన్ అనే భారతీయ విద్యార్థిని వీసా రద్దు కావటంతో స్వయంగా దేశ బహిష్కరణకు గురైంది. అలాగే బాదర్ ఖాన్ సూరి అనే రీసెర్చర్ హమాస్ సీనియర్ అధికారితో సంబంధాలున్నాయని ఆరోపణలతో యూఎస్ విడిచిపెట్టి సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అమెరికాలో కళాశాలల్లో యూదు వ్యతిరేక కేసులను ఎలా నిర్వహిస్తున్నాయో అంచనా వేసేందుకు అధికారులు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లు విద్యా శాఖలో పౌర హక్కుల తాత్కాలిక సహాయ కార్యదర్శి క్రెయిగ్ ట్రైనర్ అన్నారు. యూదు విద్యార్థులను రక్షించడంలో విఫలమైనందుకు అరవై విశ్వవిద్యాలయాలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు అందుకున్నాయి. ఈ సంస్థలలో చాలా వరకు పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. అయితే అమెరికాలోని అధికారులు మాత్రం విద్యార్థుల పేర్లు, వారి జాతి, దేశం వంటి వివరాలను ఎలాంటి దర్యాప్తులకు వినియోగించుకోవటం లేదని చెబుతున్నారు. న్యాయవాదులు మాత్రం దీనిని చట్టాల ఉల్లంఘనగా చెబుతున్నారు. దీనిపై నిరసనలు సైతం జరుగుతున్నాయి. భవిష్యత్తులో ట్రంప్ ఈ వివరాలను ఎలా ఉపయోగిస్తారో అనే ఆందోళనలు మాత్రం చాలా మంది భారతీయ విద్యార్థుల్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి.