140 దేశాలను వెనక్కి నెట్టి గ్లోబల్ టీచర్ అవార్డు గెలుచుకున్న ఇండియన్

140 దేశాలను వెనక్కి నెట్టి  గ్లోబల్ టీచర్ అవార్డు గెలుచుకున్న ఇండియన్

మారుమూల గ్రామానికి చెందిన టీచర్‌కు రూ. 7 కోట్ల ప్రైజ్ మనీ

విద్యార్థి జీవితంపై గురువు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒక విద్యార్థి ఉన్నతస్థితిలో ఉన్నాడంటే దానికి కారణం గురువు. అలాంటి ఓ గురువు గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020ని గెలుచుకున్నాడు. బాలికా విద్యను ప్రోత్సహించడం మరియు క్యూఆర్ కోడెడ్ పుస్తకాల ద్వారా విద్యా రంగంలో చేసిన కృషికిగాను ఆయనకు ఈ ఘనతదక్కింది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామంలోని జిల్లాపరిషత్ పాఠశాలలో ప్రైమరీ టీచర్‌గా పనిచేస్తున్న రంజిత్‌సింగ్ డిసాలేకు ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం కింద ఆయనకు రూ. 7 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఈ అవార్డు ఒక భారతీయుడికి రావడం ఇదే మొదటిసారి. దాంతో ఈ అవార్డు దక్కించుకున్న మొదటి భారతీయుడిగా డిసాలే రికార్డుకెక్కాడు. ఈ అవార్డు కోసం ప్రపంచంలోని 140 దేశాల నుంచి 12,000 మంది ఉపాధ్యాయులు నామినేషన్లలో నిలిచారు. వీరందరిని కాదని ఈ అవార్డు డిసాలేను వరించింది.

డిసాలే ఈ స్కూళ్లో ఉపాధ్యాయుడిగా 2009లో చేరాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి పాఠశాల శిధిలమైన భవనంలో పశువుల షెడ్‌గా మరియు స్టోర్ రూమ్‌గా ఉంది. ఆయన స్థానికలతో కలిసి పాఠశాలను మళ్లీ మూములు స్థితికి తీసుకువచ్చాడు. డిసాలే అక్కడ ఉపాధ్యాయుడిగా చేరిన తర్వాత గ్రామంలో బాల్యవివాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. అదేవిధంగా పాఠశాలలో బాలికల హాజరుశాతం 100 శాతానికి తగ్గలేదు. మహారాష్ట్ల్రలో క్యూఆర్ కోడేడ్ పుస్తకాలను ప్రవేశపెట్టాలని మొదటగా డిసాలేనే రాష్ట్ర విద్యాశాఖకు లేఖ రాశాడు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులకు క్యూఆర్ కోడేడ్ పుస్తకాల చదువును అమలుచేయాలని ఆదేశించింది.

ఘర్షణ ప్రాంతాలలోని విద్యార్థుల మధ్య శాంతిని పెంపొందించడం కోసం ‘లెట్స్ క్రాస్ ది బోర్డర్స్’ అనే ప్రాజెక్ట్ ద్వారా డిసాలే భారత్‌తో పాటు పాకిస్తాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, అమెరికా మరియు ఉత్తర కొరియా విద్యార్థులను వర్చువల్‌గా ఒకే దగ్గరకు చేర్చాడు. ఆరు వారాల ఈ కార్యక్రమంలో ఎనిమిది దేశాలకు చెందిన 19,000 మంది విద్యార్థులు చేరారు.

‘చాక్‌పీస్ మరియు సవాళ్ళతో తమ విద్యార్థుల జీవితాలను మార్చేశక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడాన్ని బాగా నమ్ముతారు. అందుకే నాకు వచ్చిన ఈ ప్రైజ్ మనీలో సగాన్ని నాతోటి ఫైనల్‌కు చేరిన 9 దేశాలకు చెందిన 9 మంది ఉపాధ్యాయులకు పంచాలనుకుంటున్నాను. ఈ డబ్బుతో వారు మరికొంతమంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తారు. వారు కూడా తమతమ స్కూళ్లలోని విద్యార్థుల జీవితాలను మార్చడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు. ఉపాధ్యాయులు మాత్రమే ప్రపంచాన్ని మార్చగలరని నేను నమ్ముతున్నాను’ అని రంజిత్‌సింగ్ డిసాలే అన్నారు.

మహారాష్ట్రకు చెందిన డిసాలేకు ఈ అత్యంత పురస్కారం డిసాలేకు లభించడం పట్ల ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రశంసించారు. ‘సోలాపూర్ జిల్లాలోని పరితేవాడిలోని జెడ్‌పీ పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌సింగ్ డిసాలేకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన వార్కీ ఫౌండేషన్ ప్రతి ఏటా ఇచ్చే గ్లోబల్ టీచర్ ప్రైజ్ ద్వారా రూ. 7 కోట్లు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. వినూత్న ఆలోచనలు మరియు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామీణ ప్రాంతాల పిల్లలలో విద్యపట్ల ఆసక్తిని కలిగించడానికి డిసాలే చేసిన పని ప్రశంసనీయం. ఉపాధ్యాయులందరూ డిసాలేను అనుకరించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఉపాధ్యాయ వృత్తిలో విశేష కృషి చేసిన వారిని గుర్తించి.. వారికి వార్షిక బహుమతిని అందచేయాలని వర్కీ ఫౌండేషన్ 2014లో ఈ అవార్డును ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ప్రతిఏటా గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే 2020గాను గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020కి డిసాలే ఎంపికయ్యాడు.

For More News..

‘కిడ్ ఆఫ్ ది ఇయర్’‌గా 15 ఏళ్ల ఇండో-అమెరికన్