
- టాప్ సీడ్‌గా ఇండియా అమ్మాయిలు
- అబ్బాయిల జట్టుపైనా అంచనాలు
బుడాపెస్ట్ : ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్ చెస్ ఒలింపియాడ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఇండియా జట్లు స్వర్ణ పతకంపై గురి పెట్టాయి. బుధవారం మొదలయ్యే మెగా ఈవెంట్‌లో అనుభవం, యువ బలం కలగలిసిన ఆటగాళ్లతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాయి. 2020లో ఆన్‌లైన్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి ఇండియా గోల్డ్ మెడల్ నెగ్గింది. కానీ, అప్పుడు డిఫరెంట్ ఫార్మాట్‌లో టోర్నీ నిర్వహించారు. అంతకుముందు 2014, 2022లో మన జట్టు కాంస్య పతకాలు గెలిచింది.
ఇప్పుడు తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక, యంగ్‌స్టర్ ఆర్. వైశాలితో కూడిన అమ్మాయిల జట్టు టాప్ సీడ్‌గా, ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అంతగా బలమైన ప్రత్యర్థులు పోటీలో లేకపోవడంతో అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేండ్లకు ఓసారి జరిగే ఈ టోర్నీలో ఇండియా విమెన్స్ టీమ్ ఈసారి లెజెండరీ ప్లేయర్ కోనేరు హంపి లేకుండానే బరిలోకి దిగుతోంది. అయితే, యంగ్‌స్టర్ వైశాలి ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లడంతోపాటు విమెన్స్ సర్క్యూట్‌లో మెరుగైన ఫలితాలు రాబడుతున్న నేపథ్యంలో హంపి గైర్హాజరీ జట్టుపై పెద్దగా ప్రభావం చూపే చాన్స్ కనిపించడం లేదు.
హంపి లేకపోవడంతో హారిక టాప్ బోర్డ్‌లో పోటీ పడనుంది. ఆ తర్వాత వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంతికా అగర్వాల్ ప్రధాన ప్లేయర్లుగా ఉండగా.. తానియా సచ్‌దేవ్ రిజర్వ్‌గా అందుబాటులో ఉండనుంది. అవసరం అయితే తానియా కూడా పలు గేమ్స్‌లో పోటీ పడొచ్చు. ఈసారి చైనా నుంచి బలహీన జట్టు పోటీలో ఉంది. ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో టాప్–4 మహిళా ప్లేయర్లు చైనా వాళ్లే అయినా వారిలో ఒక్కరు కూడా ఒలింపియాడ్‌కు రావడం లేదు.
క్రీడా ఆంక్షల కారణంగా రష్యా ఈ మెగా టోర్నీకి వరుసగా రెండోసారి దూరమైంది. ఉక్రెయిన్ కూడా తమ అత్యుత్తమ జట్టును బరిలోకి దింపకపోవడంతో కూడిన ఇండియా విమెన్స్ జట్టుపైనే అందరి దృష్టి ఉంది. రెండో సీడ్ జార్జియాతో మన జట్టుకు సవాల్ ఎదురవనుంది. పోలాండ్ మూడో సీడ్‌గా ఉండగా.. చైనా, ఉక్రెయిన్ వరసగా 4,5వ సీడ్స్‌గా పోటీపడుతున్నాయి.
మన అర్జున్‌పై అంచనాలు
ఓపెన్ సెక్షన్‌లో డి. గుకేశ్ నాయకత్వంలోని ఇండియా జట్టులో పలువురు యువ ప్రతిభావంతులు బరిలో నిలిచారు. తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్, ఆర్. ప్రజ్ఞానందతో పాటు సీనియర్లు పెంటేల హరికృష్ణ, , విదిత్ గుజరాతీ జట్టును ముందుకు తీసుకెళ్లనున్నారు. గత ఎడిషన్‌లో కాంస్యం సాధించిన ఇండియా అబ్బాయిలు ఈసారి కూడా మెరుగైన పతకం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మెన్స్ టీమ్ రెండో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. నిలకడగా విజయాలు సాధిస్తున్న ప్రపంచ నాలుగో ర్యాంకర్ అర్జున్‌పై అంచనాలు ఉన్నాయి. వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్షత సాధించిన గుకేశ్, సంచలనాలకు మారుపేరైన ప్రజ్ఞానంద మాదిరిగా అర్జున్ తన కెరీర్‌లో భారీ విజయం ఆశిస్తున్నాడు. హరికృష్ణ, విదిత్ తమ అనుభవంతో జట్టుకు అవసరమైన స్థిరత్వాన్ని అందించనున్నారు. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ లెజెండరీ ప్లేయర్, ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండోసారి ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు.
కాగా, సగం మంది వలస ప్లేయర్లతో కూడిన అమెరికా జట్టు ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. స్టార్ ప్లేయర్ ఫాబియానో కరువానా టాప్ బోర్డ్‌లో పోటీ పడనున్నాడు. హికారు నకమురా సేవలను కోల్పోయినా వెస్లీ సో, లెనియర్ పెరెజ్, లెవాన్ అరోనియన్, రాబ్సన్ రేతో అమెరికా పటిష్టంగా కనిపిస్తోంది. చైనా కూడా ఓపెన్లో పూర్తి-బలంతో కూడిన జట్టును బరిలోకి దింపింది.
టాప్ బోర్డులో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ డింగ్ లిరెన్ ఉన్నాడు. చైనా మూడో సీడ్‌గా పోటీలో ఉంది. కాగా, ఈ టోర్నీ ఓపెన్, విమెన్స్ కేటగిరీలో 11 రౌండ్లలో పోటీలు జరుగుతాయి. ప్రతి విజయానికి రెండు పాయింట్లు లభిస్తాయి. ఎక్కువ పాయింట్లు నెగ్గిన జట్లకు వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యాలు లభిస్తాయి. అవసరం అయితే టై బ్రేక్ గేమ్స్ నిర్వహిస్తారు. ఈ నెల 23వ తేదీ వరకు జరిగే మెగా టోర్నీలో ఓపెన్‌లో 191 జట్లు, మహిళల విభాగంలో 180 జట్లు పోటీ పడనున్నాయి.