హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో ఇండియన్ షూటర్ల గురి అదురుతోంది. గురువారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సరబ్జోత్ సింగ్–అర్జున్ సింగ్ చీమా–శివ నర్వాల్‌తో కూడిన టీమిండియా బంగారు పతకంతో మెరిసింది. టైటిల్ ఫైట్‌లో ఇండియన్ త్రయం 1734 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. చైనీస్ త్రయం 1733 పాయింట్లతో సిల్వర్ సాధించగా, వియత్నాం షూటర్లు 1730 పాయింట్లతో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. టీమ్ కేటగిరీలో ఇండియాకు ఇది మూడో గోల్డ్ కాగా, ఓవరాల్‌గా నాలుగోది. ఇప్పటివరకు షూటింగ్‌లో ఇండియా ఖాతాలో 4 గోల్డ్, 4 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్‌లో సరబ్జోత్ 580 పాయింట్లతో (95, 95, 97, 98, 97, 98) ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి వచ్చాడు. దీంతో శనివారం 22వ పడిలోకి ప్రవేశించనున్న అతను ఓ రోజు ముందుగానే గోల్డెన్ బర్త్ డే గిఫ్ట్ అందుకున్నాడు. చీమా 578 పాయింట్లతో ( 97, 96, 97, 97, 96 ,95) ఎనిమిదో ప్లేస్‌ను సాధించాడు. నర్వాల్ 576 పాయింట్లతో (92, 96, 97, 99, 97, 95 )14వ ప్లేస్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 6 గోల్డ్, 8 సిల్వర్, 11 బ్రాంజ్‌తో కలిపి మొత్తం 25 మెడల్స్‌తో ఇండియా ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నది.
ఇండివిడ్యువల్ కేటగిరీలో ఫెయిల్..
టీమ్ విభాగంలో గోల్డ్‌తో మెరిసిన సరబ్జోత్ ఇండివిడ్యువల్ కేటగిరీలో మాత్రం ఫెయిలయ్యాడు. క్వాలిఫికేషన్‌లో ఐదో ప్లేస్‌లో నిలిచి ఫైనల్‌కు చేరిన అతను టైటిల్ ఫైట్‌లో మాత్రం 199 పాయింట్లతో నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. మరో షూటర్ అర్జున్ ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మిక్స్‌డ్ స్కీట్ టీమ్ ఈవెంట్‌లో గనేమత్ సెకోన్–అనంత్ జీత్ సింగ్ నరుకా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫికేషన్‌లో ఇండియా జోడీ 138 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గనేమత్ 67/75, నరుకా 71/75 స్కోరు చేశారు.
అనూష్‌కు బ్రాంజ్
ఈక్వెస్ట్రియన్‌లో ఇండియాకు బ్రాంజ్ మెడల్ లభించింది. ఇండివిడ్యువల్ డ్రెస్సేజ్ ఈవెంట్‌లో అనూష్ అగర్వాల 73.030 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌లో నిలిచాడు. ఈక్వెస్ట్రియన్‌లో ఇండియాకు ఇది రెండో మెడల్ కావడం విశేషం. పతకం ఆశలు పెట్టుకున్న హ్రిదోయ్ విపుల్ చెడ్డా మెడల్ కాంపిటీషన్ తొలి రౌండ్‌లోనే ఎలిమినేట్ అయ్యాడు. బిన్ మహ్మద్ ఫాతిల్ మహ్మద్ క్వాబిల్ అంబాక్ (మలేసియా–75.780), జాక్వెలైన్ వింగ్ యింగ్ సియు (హాంకాంగ్–73.450) వరుసగా గోల్డ్, సిల్వర్ గెలిచారు.
రోషిబినా సిల్వర్ మెరుపులు
వుషూలో ఇండియా ప్లేయర్ రోషిబినా దేవి సిల్వర్‌తో మెరిసిందివిమెన్స్ 60 కేజీ సాండా ఫైనల్లో రోషిబినా 0–2తో వుయ్ జియావోయి (చైనా) చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. 2018 ఆసియా గేమ్స్‌లో బ్రాంజ్ నెగ్గిన రోషిబినా ఈసారి పతకం రంగును మార్చింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రోషిబినాకు, జియావోయి నుంచి గట్టి పోటీ ఎదురైంది. చైనీస్ ప్లేయర్ అద్భుతమైన టెక్నిక్‌తో ఆకట్టుకుంది. అయితే తొలి రౌండ్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన రోషిబినా.. జియావోయిని మ్యాట్‌పై పడేసే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. అయితే రెండో రౌండ్‌లో జియావోయి అటాకింగ్ గేమ్‌తో ఇండియన్ ప్లేయర్‌ను అడ్డుకుంది. దీంతో రెండు రౌండ్ల తర్వాత చైనా ప్లేయర్‌ను విన్నర్‌గా ప్రకటించారు. తన మెడల్‌ను మణిపూర్ హింసకాండ బాధితులకు అంకితమిస్తున్నట్లు రోషిబినా ప్రకటించింది.
నేటి మెయిన్ ఈవెంట్లు
అథ్లెటిక్స్: వికాస్, సందీప్ (మెన్స్ 20 కి.మీ ఫైనల్), ప్రియాంక గోస్వామి (విమెన్స్ 20 కి.మీ ఫైనల్), విమెన్స్ షాట్‌పుట్ ఫైనల్: మన్‌ప్రీత్ కౌర్ - కిరణ్ బలియాన్
విమెన్స్ హ్యామర్ త్రో ఫైనల్: తన్యా చౌదరి, రచనా కుమారి, బాక్సింగ్ క్వార్టర్‌ఫైనల్: నిఖత్ జరీన్ X హనన్ నాసెర్
షూటింగ్: మెన్స్ 50మీ. 3 పొజిషన్ క్వాలిఫికేషన్, ఫైనల్ (స్వప్నిల్, ఐశ్వర ప్రతాప్, అఖిల్), విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్, ఫైనల్ (ఇషా సింగ్, దివ్య, పాలక్),
టెన్నిస్: సాకేత్-రామ్‌కుమార్ డబుల్స్ ఫైనల్, బోపన్న-రుతుజా మిక్స్‌డ్ సెమీస్