Team India: వాంఖడేలో భారత జట్టుకు స‌న్మానం.. పోటెత్తిన అభిమానులు 

Team India: వాంఖడేలో భారత జట్టుకు స‌న్మానం.. పోటెత్తిన అభిమానులు 

కరేబియన్ గడ్డపై టీ20 ప్రపంచకప్‌ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్‌ సేనకు స్వదేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. వారు ఎటెళ్లిన జనం నీరాజనం పలుకుతున్నారు. త్రివర్ణ పతాకాలను చేతపట్టి.. 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఆటగాళ్లు సైతం ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నారు. అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు.

ప్రధాని మోడీతో భేటీ అనంతరం ముంబై బయలుదేరిన భారత జట్టు మరికొద్ది సేపట్లో ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టనుంది. అక్కడినుంచి ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో బీసీసీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విక్టరీ పరేడ్‌‌ ప్రారంభం కానుంది. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్సులో ఊరేగుతూ అభిమానులను పలకరించనున్నారు.  దాదాపు 2 కిలోమీటర్ల దూరం సాగే ఈ ర్యాలీ మెరైన్ డ్రైవ్ నుండి ప్రారంభమై వాంఖడే స్టేడియం వరకూ సాగనుంది. ఈ ర్యాలీ ముగిశాక వాంఖడే వేదికగా భారత క్రికెటర్లను సన్మానించనుంది.. బీసీసీఐ. బహుమతిగా ప్రకటించిన 125 కోట్ల రూపాయల నజరానాను అందించనుంది.

భారీగా చేరుకుంటున్న అభిమానులు

భారత క్రికెటర్ల సన్మాన కార్యక్రమం సంధర్భంగా వాంఖడే స్టేడియానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఉచిత ప్రవేశం, టీ20 ప్రపంచకప్ వీరులను దగ్గర నుంచే చూసే వెసులుబాటు ఉండటంతో ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో వాంఖడేకు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం స్టేడియం పరిసరాలన్నీ అభిమానులతో కిటకిటలాడుతున్నాయి. స్టేడియం బయట దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ ఉన్నట్లు తెలుస్తోంది. నిర్ణీత సమయానికి అరగంట ముందే గేట్లు తెరిచారు. ఒక్కొక్కరిగా లోపాలకి పంపిస్తున్నారు. అదే సమయంలో ముంబై క్రికెట్ అసోసియేషన్.. స్థానిక పోలీసుల సహకారంతో ముందుగానే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.