
TCS Pay Hikes: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న టీసీఎస్ తాజాగా తన నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అయితే ఫలితాలు మార్కెట్లు ఊహించిన స్థాయిలో ఆశాజనకంగా లేకపోవటం పెట్టుబడిదారులను నిరాశకు గురిచేసిందని చెప్పుకోవాలి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తన టెక్కీలకు వేతన పెంపులను ఆలస్యం చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో శాలరీ హైక్స్ కోసం ఆశగా ఎదురుచూసిన చాలా మంది ఉద్యోగులు షాక్ అవుతున్నారు.
మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీలో మెుత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షల 07వేల 979గా ఉన్నట్లు కంపెనీ తన ఆర్థిక ఫలితాల్లో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాపార అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది తర్వాతి త్రైమాసికాల్లో పరిస్థితులు చక్కబడిన తర్వాతే వేతన పెంపులు ఉంటాయని కంపెనీ ఉద్యోగులకు స్పష్టం చేసింది. ఎప్పుడు శాలరీ హైక్స్ ఇవ్వాలనే విషయాన్ని తాము నిర్ణయిస్తామని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లఖ్కడ్ పేర్కొన్నారు.
అమెరికాలో మాంద్యం వస్తుందనే భయాలతో ఇప్పటికే భారతీయ ఐటీ పరిశ్రమలోని అనేక కంపెనీ షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించటం ప్రారంభించారు. దీంతో అనేక టెక్ స్టాక్స్ ధరలు తమ 52 వారాల కనిష్ఠాలకు తాకాయి. టీసీఎస్ ప్రకటన ఆర్థిక వ్యవస్థలో రానున్న అనిశ్చితులకు అద్దం పడుతోందని బ్రోకరేజ్ ఆనంద్ రాఠీ నిపుణుడు సుజన్ హజ్రా వెల్లడించారు. పరిస్థితులు భారీగా దిగజారినప్పటికీ భారత ఐటీ సేవల కంపెనీలపై అసమానమైన ప్రభావం ఉండబోదని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
►ALSO READ | Health Insurance: ప్రైవేట్ డిటెక్టివ్స్ ఓకే చేస్తేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్.. వింత అనుభవం..
ఇలాంటి ప్రతికూలతలు స్వల్ప కాలంలో ఉన్నప్పటికీ టీసీఎస్ యాజమాన్యం కొత్త ఆర్థిక సంవత్సరం గత ఆర్థిక సంవత్సరం కంటే మెరుగైన వ్యాపారాన్ని చూస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారం మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొనటం గమనార్హం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వ్యాపారంలో పనితీరు బలంగా, మెరుగ్గానే కొనసాగుతోందని, కంపెనీకి దీని నుంచి 30 శాతం వరకు ఆదాయం వస్తోందని టీసీఎస్ వెల్లడించింది.
ప్రస్తుతం భారతదేశంలోని ఐటీ రంగంలోని కంపెనీలకు ప్రధాన క్లయింట్లు అమెరికాలో ఉండటంతో ఆందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం రానున్న కాలంలో ఎలా ఉండనుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. దేశీయ టెక్ కంపెనీల ఆదాయంలో దాదాపు 60 శాతం అమెరికా మార్కెట్లలోని క్లయింట్ల నుంచి వస్తున్న వేళ భారతీయ కంపెనీలు ప్రస్తుత పరిస్థితులను నిశితందా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీలు తమ ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు కూడా చర్యలు ప్రారంభించాయని తెలుస్తోంది. ఇది సమీప భవిష్యత్తులో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.