ఖతార్ జైల్లో వడోదరా వాసి.. డేటా చోరీ కేసులో 3 నెలలుగా దోహా జైల్లోనే..

ఖతార్ జైల్లో వడోదరా వాసి.. డేటా చోరీ కేసులో 3 నెలలుగా దోహా జైల్లోనే..

న్యూఢిల్లీ: గుజరాత్ వడోదరాకు చెందిన అమిత్ గుప్తా.. డేటా చోరీ కేసులో ఖతార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా అతన్ని దోహాలోని జైల్లో ఉంచారు. అతను టెక్ మహీంద్రా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే.. అరెస్ట్ విషయం అతని తల్లిదండ్రులకు పోలీసులు తెలియజేయలేదు. గత కొద్ది రోజులుగా తమ కొడుకు తమతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి.. అతని ఫ్రెండ్​కు కాల్‌‌ చేయగా.. అరెస్ట్ విషయం తెలిసిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఖతార్ వెళ్లి అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులకు జరిగిన విషయం అంతా చెప్పారు. 

ఈ సందర్భంగా అమిత్ గుప్తా తల్లి పుష్పా గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘‘జనవరి 1న నా కొడుకు అమిత్ గుప్తాను ఖతార్ స్టేట్ సెక్యూరిటీ అదుపులో తీసుకున్నది. 48 గంటల పాటు భోజనం, నీళ్లు ఇవ్వలేదు. డేటా చోరీ చేసినట్లు ఆరోపిస్తున్నారు. నా కొడుకు అలాంటి వాడు కాదు. చాలా ఏండ్లుగా టెక్ మహీంద్రా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఎవరో కావాలనే నా కొడుకును తప్పుడు కేసులో ఇరికించారు. అరెస్ట్ విషయం మాకు ఎవరూ చెప్పలేదు. అమిత్ ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాం. ఖతార్​లోని ఇండియన్ ఎంబసీ అధికారులను కలిశాం. నా కొడుకును వెంటనే రిలీజ్ చేసేలా చూడండి. ఇండియన్ పీఎంవో అధికారులు కల్గజేసుకుని మాకు న్యాయం చేయండి’’అని ఆమె కోరారు.