
Telecom Tariff Hikes: గత ఏడాది టెలికాం కంపెనీలు తమ మెుబైల్ టారిఫ్స్ పెంచిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ వివాహ వేడుక తర్వాత రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచటంతో మిగిలిన ప్రైవేటు టెలికాం సంస్థలు సైతం తమ టారిఫ్స్ రివైజ్ చేశాయి. దీంతో అప్పట్లో చాలా మంది ఘర్ వాపసీ నినాదంతో బీఎస్ఎన్ఎల్ కి మారిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఏడాది మరోసారి టెలికాం సంస్థలు తమ టారిఫ్స్ పెంచటానికి సిద్ధంగా ఉన్నాయనే వార్త యూజర్లను షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఏడాది ఛార్జీలను భారీగా పెంచేందుకు భారత టెలికాం సంస్థలు సిద్ధమౌతున్నాయని తేలింది. 2025 చివరి నాటికి ఈ పెంపు 10 నుంచి 20 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన ఆరేళ్లలో నాలుగో అతిపెద్ద రేట్ల పెంపుగా ఇది ఉండనుందని వారు చెబుతున్నారు. ప్రధానంగా పెరుగుతున్న రెగ్యులేటరీ సమస్యలతో పాటు వ్యాపారాన్ని నడిపేందుకు అవసరమౌతున్న భారీ క్యాపిటల్ అవసరాల కారణంగా ఈ నిర్ణయం నడిపించబడుతోందని తెలుస్తోంది.
అయితే ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భారత ప్రభుత్వం ఇటీవల వొడఫోన్ ఐడియా కంపెనీలో స్పెక్ట్రమ్ బకాయిలు రూ.36వేల 950 కోట్లను ఈక్విటీ వాటాలుగా కన్వర్ట్ చేసుకుందని తెలుస్తోంది. నవంబర్-డిసెంబర్ మధ్య రేట్ల పెంపుల ప్రకటన ఉండనుందని ప్రముఖ బ్రోకరేజ్ బెర్న్ స్టీన్ వెల్లడించింది. ఇది కంపెనీల చేతికి అధిక రాబడులను అందించటంతో పాటు లాభదాయకతను పెంచుతుందని బ్రోకరేజ్ పేర్కొంది.
►ALSO READ | Sensex Rally: సెన్సెక్స్ 1300 పాయింట్లు అప్.. నేడు సెన్సెక్స్-నిఫ్టీ ర్యాలీకి 5 కారణాలివే..
ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉన్న వొడఫోన్ ఐడియా మిగిలిన కంపెనీల కంటే ఎక్కువగా రేట్ల పెంపుపై ఆధారపడి ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. కంపెనీ తన 4జీ విస్తరణతో పాటు 5జీ రోలవుట్ కోసం నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో మాదిరిగా ఏడాదికి ఒకసారి రేట్ల పెంపు ప్రస్తుత కాలంలో సరైనది కాదని, వేగంగా టారిఫ్స్ పెంచాల్సిన అవసరం ఉందని విఐ సీఈవో అక్షయ ముంద్ర మూడో త్రైమాసిక ఫలితాల సమయంలో నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే.
చివరిగా టెలికాం కంపెనీ 25 శాతం వరకు రేట్ల పెంపును జూలై 2024లో ప్రకటించాయి. దానికి ముందు 2019లో 12-15 శాతం పెంపును చూసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సైతం టెలికాం కంపెనీలకు రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యా్ప్తంగా టెలికాం టారిఫ్స్ ఇండియాలోనే తక్కువగా ఉన్నాయని జనవరిలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇకపై టెలికాం సంస్థలు తరచుగా టారిఫ్స్ రివైజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే కనీసం నెలవారీ రీఛార్జి ప్యాక్స్ ధరలు రూ.30 నుంచి రూ.60 మధ్యలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో పక్క బీఎస్ఎన్ఎల్ మాత్రం తాము రేట్లను పెంచబోమని ఇస్తున్న హామీ చాలా మంది యూజర్లను ఆకర్షిస్తోంది.