జోల పాటల్ని జమ చేస్తున్నరు

జోల పాటల్ని జమ చేస్తున్నరు

చిన్నప్పుడు చందమామని చూపిస్తూ అమ్మ లాలిపాట పాడుతుంది. చంటిపిల్లల్ని చంకనెత్తుకుని   జోలపాడుతూ నిద్రపుచ్చుతుంది. అయితే ఈ జనరేషన్ పిల్లలు ఆడియోబుక్స్​లో జోలపాటలు వింటున్నారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు జోలపాటలు పాడేవాళ్లు, వినేవాళ్లు కూడా తగ్గిపోయారు. బెంగళూరుకి చెందిన గురుప్రియ ఆత్రేయ, వేదాంత్​ భరద్వాజ్​లు జోలపాటల్ని మళ్లీ వినిపిస్తున్నారు. అందుకోసం  ‘సింగ్​ ఎ లల్లబీ’ ప్రాజెక్ట్ ద్వారా వర్క్​షాప్స్​ నడుపుతున్నారు. జోలపాటలతో పెనవేసుకున్న బంధాన్ని  గుర్తుచేస్తున్న ఈ ఇద్దరి గురించి...
గురుప్రియ సింగర్​ మాత్రమే కాదు వాయిస్​ ఓవర్​ ఆర్టిస్ట్​ కూడా. వేదాంత్ సంగీతం కంపోజ్​ చేస్తాడు.​ జోలపాటల్ని రికార్డ్ చేసి, నాలుగు ఆల్బమ్స్​ తేవాలనే ఆలోచనతో ఉన్నారు ఇద్దరు. ఈ మధ్యే వీళ్లు ఉర్దూ, హిందీలో ‘అమ్నా బీబీ’ సింగిల్​ రిలీజ్​ చేశారు. ఈ పాటని గురుప్రియతో కలిసి ఎ.ఆర్​.రెహమాన్​ కూతురు ఖతిజా పాడింది. దానికి మంచి రెస్పాన్స్​ వచ్చింది. ఈ యానిమేషన్​ పాటలో బిడ్డని చంకనెత్తుకుని ఇంటి ముంగట జోలపాడుతుంటుంది తల్లి. గురుప్రియ, వేదాంత్​లు ఇప్పటి వరకూ 52కి పైగా జోలపాటల్ని కలెక్ట్ చేశారు. వీటిలో 38 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలవి కూడా ఉన్నాయి. వీళ్లిద్దరూ పోయిన ఏడాది అక్టోబర్​ 27 నుంచి ఈ ఏడాది అక్టోబర్​ 19 వరకు (52 వారాలు) వర్క్​షాపు నడిపించారు.
అర్థం తెలుసుకుని..
వీళ్ల జోలపాటల కలెక్షన్​లో సంస్కృతం, బిదారి, బ్రాజ్​, మైథిలి, భోజ్​పురి, కొంకణి, సింధి వంటి భాషలు, ఇతర భారతీయ భాషలకి చెందిన జోలపాటలు ఉన్నాయి. శ్రీలంక, మాలి, అల్బాని, ట్రినిడాడ్​, టోంగా దేశాల జోల పాటలు కూడా ఉన్నాయి ఇందులో. ముందుగా ఆయా జోలపాటల్ని కలెక్ట్ చేస్తారు. అక్కడి వాళ్లని కలిసి ఆ పాట అర్థం, ఆ పదాల్ని ఎలా పలకాలి? అనేవి తెలుసుకుంటారు. ఆ తర్వాత మ్యూజిక్​ కంపోజ్​ చేస్తారు. జోలపాటల్ని కలెక్ట్​ చేయడం కోసం ఫ్రెండ్స్, ఆర్టిస్ట్​ కమ్యూనిటీ, ఇంటర్నెట్​ సాయం తీసుకుంటారు. 
కరోనా టైమ్​లో... 
జోలపాటల ఆల్బమ్ చేయాలని ఏడేండ్ల క్రితం అనుకున్నాం. కరోనా టైమ్​లో అన్నీ కుదిరాయి. చాలామంది పిల్లలు, పెద్దవాళ్లు ఒత్తిడి వల్ల నిద్రపట్టక ఇబ్బందిపడేవాళ్లు. 
దాంతో వాళ్లకి మా జోలపాటలతో రిలీఫ్​ ఇవ్వాలి అనుకున్నాం. ఒకసారి పంజాబ్ నుంచి ఒక ఫ్రెండ్​ రేర్​గా విన్న జోలపాట ఒకటి పంపించాడు. అయితే అతనికి ఆ పాటని ఎలా పాడాలో తెలియదు. దాంతో పంజాబ్ ఫోక్​ సింగర్​ రాధికా సూద్​ నాయక్​ చేత ఆ పాటకి సంగీతం కంపోజ్​ చేయించాం” అని తమ ‘సింగ్​ ఎ లల్లబీ’ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు వేదాంత్​. 
అన్ని వయసుల వాళ్లకీ జోలపాటలు అవసరమే
“జోలపాటలు వినసొంపుగా ఉండడమే కాదు తల్లీబిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచుతాయి కూడా. అంతేకాదు పిల్లల్లో ఆలోచనా శక్తి పెరగడానికి, భాష మీద పట్టు రావడానికి పనికొస్తాయి కూడా. చాలాదేశాల్లో జోలపాటలు పాడేతీరు, వాటి సంగీతం దాదాపు ఒకేలా అనిపిస్తాయి. ఉదాహరణకి... తమిళ భాషలో ‘ఆరారో’ అని జోలపాడతారు. స్పానిష్​ భాషలో ‘అర్రు అర్రు’ అని పాడతారు. జోలపాటలు పాడడమే కాదు వాటిని హమ్మింగ్​ చేయడం కూడా ఈజీ. జోలపాటల్లో పక్షులు, జంతువులు, పురాణ గాథలు, నక్షత్రాలు, చందమామ థీమ్​తో ఉన్నవే ఎక్కువ. పిల్లలకే కాదు అన్ని వయసులవాళ్లకి జోలపాటలు అవసరమే’’  అని చెబుతోంది గురుప్రియ.