![ఉక్రెయిన్‌లో బుల్లెట్ గాయాలైన విద్యార్థి రేపు భారత్‌కు](https://static.v6velugu.com/uploads/2022/03/Indian-who-sustained-bullet-injuries-in-Kyiv-will-return-to-India-with-us-tomorrow-VK-Singh_Q9Z2mh1q8V.jpg)
ఉక్రెయిన్ యుద్ధ కల్లోలం నుంచి బయటపడే ప్రయత్నంలో బుల్లెట్ గాయాలపాలైన ఇండియన్ స్టూడెంట్ హర్జోత్ సింగ్ ను రేపు స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కీవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు వైపు ప్రయాణిస్తుండగా అతడిపై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో అతడికి బుల్లెట్ గాయాలతో పాటు ఫ్యాక్చర్స్ కూడా అయినట్లు హర్జోత్ వీడియో ద్వారా తెలిపాడు. ఇప్పుడు అతడిని సేఫ్ గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలాండ్ లో ఉన్న మన కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చెప్పారు. హర్జోత్ సింగ్ పై కాల్పులు జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు కంగారులో తన పాస్ పోర్ట్ ను పోగొట్టుకున్నాడని, అయితే అతడికి అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రేపు తమతో పాటు ఇండియాకు తీసుకొస్తున్నామని వెల్లడించారు. అతడు స్వస్థలానికి చేరుకున్నాక తల్లిదండ్రుల కేర్, ఇంటి ఫుడ్ తో త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి అన్నారు.
हरजोत सिंह वह भारतीय हैं जिन्हें कीव में युद्ध के दौरान गोली लग गई थी। अफरातफरी में इनका पासपोर्ट भी गुम गया था।
— General Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2022
सहर्ष सूचित कर रहा हूं कि हरजोत कल भारत हमारे साथ पहुंच रहे हैं।
आशा है घर के खाने और देखभाल के साथ शीघ्र स्वास्थ्यवर्धन होगा।#OperationGanga#NoIndianLeftBehind pic.twitter.com/NxOkD9mJ9U
కాగా, ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ చేపడుతోంది. ఉక్రెయిన్ లో ఉన్న మన వారిని బోర్డర్ కు చేర్చి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా స్వదేశానికి తీసుకొస్తోంది. అయితే బోర్డర్ వద్ద సమస్యలు రాకుండా, అక్కడ అవసరమైన డాక్యుమెంటేషన్ సహా ఇతర అవసరాల్లో సాయంగా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ.. నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపారు. ఇందులో భాగంగా పోలాండ్ వెళ్లిన కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ ఆ దేశ సరిహద్దుకు చేరుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.