మన ఆడోళ్లు బంగారం.. దేశ మహిళల వద్ద 25 వేల టన్నుల పసిడి

మన ఆడోళ్లు బంగారం.. దేశ మహిళల వద్ద 25 వేల టన్నుల పసిడి
  • ఇది టాప్-5 దేశాల దగ్గరున్న మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ
  • ఇండియాలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనే 40 శాతం నిల్వలు
  • సంప్రదాయం, సంపద, పెట్టుబడిగా భావించడమే కారణం
  • లండన్‌‌లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయ మహిళలకు బంగారంపై అమితమైన ప్రేమ. పండుగలకు, శుభకార్యాలకు పుత్తడిని ఎక్కువగా కొంటుంటారు. దీనివల్ల మన దేశ మహిళల వద్ద 25 వేల టన్నుల గోల్డ్ జమైంది. ఇది ప్రపంచంలోనే టాప్​-దేశాల్లో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువని..ప్రపంచంలోనే గోల్డ్​ రిజర్వుల్లో 11శాతానికి సమానమని లండన్‌‌‌‌లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టడీ తేల్చింది. 


భారత్‌‌లో బంగారానికి ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్‌‌ ఉంది. ఈ ఏడాది దిగుమతి సుంకాలను తగ్గించడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఇన్వెస్టర్లలో చాలా మంది బంగారంవైపు చూస్తున్నారు. భారీ ఎత్తున నగలు, గోల్డ్ కడ్డీలు కొంటున్నారు. అమెరికాలో మొత్తం 8 వేల టన్నుల బంగారం ఉంటే, జర్మనీలో 3,300 టన్నులు, ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్ లో 2వేల టన్నులు, రష్యాలో 1900 టన్నుల గోల్డ్ నిల్వలుఉన్నాయి.. ఈ ఐదు దేశాల దగ్గరున్న మొత్తం బంగారం కూడా ఇండియాలోని బంగారానికి సమానం కాదు.వీరందరితో పోలిస్తే భారతీయ మహిళల వద్ద 25 వేల టన్నుల బంగారం ఆభరణాల రూపంలో ఉంది.  ఇంటర్నేషనల్​మానిటరీ ఫండ్​(ఐఎంఎఫ్​), స్విట్జర్లాండ్​వంటి ధనిక దేశాల కంటే కూడా ఇండియాలో బంగారం ఎక్కువగా ఉంది. 

 దక్షిణాదిలో పసిడి వాడకం ఎక్కువ 

మన దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దక్షిణ భారతంలో పసిడి వాడకం ఎక్కువ అని స్టడీ వెల్లడించింది. దేశంలోని మొత్తం బంగారు నిల్వలలో 40 శాతం నిల్వలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ విషయంలో తమిళనాడు వాటా 28 శాతం ఉంది. 2023 నాటికి  భారతీయ కుటుంబాల దగ్గర  25వేల టన్నుల బంగారం ఉంది. బంగారం నిల్వలు భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. దీని విలువ దేశ జీడీపీలో 40 శాతం వరకు ఉంటుంది. 

ఎంత బంగారాన్ని దాచుకోవచ్చు ?

మన దేశంలో బంగారం కొనడం, అమ్మడం కోసం 3% జీఎస్టీ ఉంటుంది. ఒక కుటుంబం తమకు నచ్చినంత బంగారం ఉంచుకోవడానికి వీలు లేదు. వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెండ్లికాని మహిళలు 250 గ్రాముల వరకు దాచుకోవచ్చు. మగవాళ్లు 100 గ్రాములకు మించి నిల్వ చేయకూడదు. బంగారంపై పెట్టే పెట్టుబడులు కూడా భారీగా లాభాన్ని ఇస్తున్నాయి. ధరలు వేగంగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. 2024లో పుత్తడి ధరలు నవంబరు నాటికే 28 శాతం పెరిగాయి. మూడో క్వార్టర్​లో డిమాండ్​ విలువ వంద బిలియన్​ డాలర్లకు చేరింది. వ్యక్తులతోపాటు సెంట్రల్​బ్యాంకులూ విపరీతంగా కొంటున్నాయి. దీనివల్ల కొత్త సంవత్సరంలోనూ పసిడికి మరింత గిరాకీ ఉండొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.

ALSO READ : బంగారం ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలివే..

వాణిజ్య ఘర్షణలు ముదిరే అవకాశం

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్​ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వాణిజ్య ఘర్షణలు ముదిరే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు వస్తే బంగారం ధరలు మరింత దూసుకెళ్తాయి. ఆర్బీఐ సెంట్రల్​బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటూనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీ విలువను నియంత్రిం చడానికి బంగారాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాయి. ప్రపంచంలోని భౌగోళిక, రాజకీ య పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితుల్లో బంగారాన్ని ఒక సురక్షిత ఆస్తిగా చూస్తారు. కేంద్ర బ్యాంకులు తమ పోర్ట్‌‌ఫోలియోను విభిన్నంగా మార్చడానికి బంగారాన్ని ఉపయోగిస్తాయి. ఇది రిస్క్‌‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. గోల్డ్​డిమాండ్​లో 60 శాతం వాటా ఆసియా నుంచే ఉంది. వీటిలో ఇండియా, చైనా అతిపెద్ద మార్కెట్లు. చైనాలో ఆర్థిక పరిస్థితులు స్థిరపడటం, ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించడం వల్ల కూడా బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగవచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 

ఏ దేశం వద్ద ఎంత  బంగారం ఉందంటే...

అమెరికా     :    8,000 టన్నులు
జర్మనీ           :    3,300 టన్నులు
ఇటలీ           :    2,450 టన్నులు
ఫ్రాన్స్           :    2,400 టన్నులు
రష్యా            :    1,900 టన్నులు