దీప్తి రాణించినా..రెండో టీ20లో ఇండియా ఓటమి

దీప్తి రాణించినా..రెండో టీ20లో ఇండియా ఓటమి
  •     6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

ముంబై: దీప్తి శర్మ (31, 2/22) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో మెప్పించినా.. మిగతా ప్లేయర్లు నిరాశపరచడంతో రెండో టీ20లో ఇండియాకు ఓటమి తప్పలేదు.  ఛేజింగ్‌లో ఎలైస్ పెర్రీ (34 నాటౌట్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ అలీసా హీలీ (26) రాణించడంతో ఆదివారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 1–1తో సమం చేసింది.

టాస్‌‌‌‌ ఓడిన ఇండియా తొలుత 20 ఓవర్లలో 130/8 స్కోరు చేసింది. దీప్తికి తోడు రిచా ఘోష్‌‌‌‌ (23), స్మృతి మంధాన (23) మెరిశారు. తర్వాత ఆసీస్‌‌‌‌ 19 ఓవర్లలో 133/4 స్కోరు చేసి నెగ్గింది. హీలీ, బెత్‌‌‌‌ మూనీ (20) తొలి వికెట్‌‌‌‌కు 51 రన్స్‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. ఏడు రన్స్‌‌‌‌ తేడాతో ఈ ఇద్దరిని దీప్తి ఔట్‌ చేసినా పెర్రీ కీలక ఇన్నింగ్స్‌‌‌‌ ఆడింది.

ఆమెకు మెక్‌‌‌‌గ్రాత్‌‌‌‌ (19), లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ (18 నాటౌట్‌‌‌‌) సపోర్ట్ ఇచ్చారు.ఆసీస్‌ తరఫున రికార్డు స్థాయిలో 300వ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడిన పెర్రీ సిక్స్‌‌తో మ్యాచ్ ముగించింది. ఇరుజట్ల మధ్య మంగళవారం మూడో టీ20 జరుగుతుంది. 

ముగ్గురే..

తొలి మ్యాచ్‌‌లో దంచికొట్టిన ఇండియా ఈసారి తడబడింది. స్టార్టింగ్‌‌‌‌ నుంచే ఆసీస్‌‌‌‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. దీప్తి, స్మృతి, రిచా మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. రెండో ఓవర్లో  షెఫాలీ (1), 4వ ఓవర్లో జెమీమా (13) ఔట్‌‌‌‌కావడంతో 20/2 స్కోరుతో నిలిచింది. భారీ సిక్సర్‌‌‌‌తో జోష్‌‌‌‌ పెంచిన స్మృతి పవర్‌‌‌‌ప్లే ముగిసే సరికి స్కోరును 33/2కు తీసుకెళ్లింది.

కానీ 8వ ఓవర్లో సదర్లాండ్‌‌‌‌ (2/18) కు వికెట్‌‌‌‌ ఇచ్చుకుంది. కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (6) మరోసారి ఫెయిలవడంతో 10 ఓవర్లకు ఇండియా 54/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో రిచా, దీప్తి వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. వరుసగా బౌండ్రీలు బాది ఆసీస్‌‌‌‌ను ఒత్తిడిలోకి నెట్టారు.

ఐదో వికెట్‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టారు. కానీ 15వ ఓవర్లో వారెహమ్‌‌‌‌ (2/17).. రిచాను ఔట్‌‌‌‌ చేసి ఝలక్‌‌‌‌ ఇచ్చింది. దీప్తి నిలకడగా ఆడినా.. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో వస్త్రాకర్‌‌‌‌ (9), అమన్‌‌‌‌జోత్ (4), శ్రేయాంక (7 నాటౌట్‌‌‌‌) భారీ షాట్స్‌‌‌‌ కొట్టలేకపోవడంతో ఇండియా చిన్న టార్గెట్‌‌‌‌నే నిర్దేశించింది. కిమ్‌‌‌‌ గార్త్‌‌‌‌ (2/27) ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్‌‌గా నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 130/8 (దీప్తి శర్మ 30, రిచా 23, వారెహమ్‌‌‌‌ 2/17, గార్త్ 2/27).
 ఆస్ట్రేలియా: 19 ఓవర్లలో 133/4 (పెర్రీ 34*, హీలీ 26, దీప్తి 2/22)