Women's T20 World Cup: టీ20 వరల్డ్ కప్.. యూఏఈ బయలుదేరిన భారత మహిళల క్రికెట్ జట్టు

Women's T20 World Cup: టీ20 వరల్డ్ కప్.. యూఏఈ బయలుదేరిన భారత మహిళల క్రికెట్ జట్టు

మహిళల టీ20 వరల్డ్ కప్ కు సమయం ఆసన్నమైంది. అక్టోబర్‌ 3 నుంచి యూఏఈ వేదిక‌గా మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా.. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో యూఏఈకి తరలించారు. ఈ టోర్నీ కోసం భారత మహిళల జట్టు మంగళవారం (సెప్టెంబర్ 24) యూఏఈ కి బయలుదేరారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు యూఏఈ కి వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read :- జమ్మూకాశ్వీర్లో రెండో విడత పోలింగ్ 

చివరిసారిగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాపై సెమీస్ లో ఓడిపోయిన మన జట్టు.. ఈ సారి టైటిలే లక్ష్యంగా బయలుదేరుతుంది. ప్రీ డిపార్చర్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. "మేము అత్యుత్తమ జట్టుతో ముందుకు వెళ్తున్నాం. ఆటగాళ్లు చాలా కాలంగా కలిసి ఆడుతున్నారు. మేము చివరిసారిగా జరిగిన వరల్డ్ కప్ లో చాలా దగ్గరగా వచ్చి సెమీస్‌లో ఓడిపోయాము. ఈ సారి ఆ పొరపాటును రిపీట్ కాకుండా చూసుకుంటాం". అని తెలిపింది

టైటిల్ పోరులో 10 జట్లు

ఈ మెగా టోర్నీ 18 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. టైటిల్ రేసులో మొత్తం 10 జ‌ట్లు ఉండగా.. వీటిని రెండు గ్రూపులు విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్ర‌తి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడ‌నుంది. అనంతరం గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్‌కు అర్హత సాధిస్తాయి.

లీగ్‌ మ్యాచ్‌లు దుబాయ్‌, షార్జా వేదికగా జరకానున్నాయి. అక్టోబర్‌ 17, 18 తేదీల్లో సెమీఫైనల్స్ నిర్వ‌హించ‌నున్నారు. సెమీఫైన‌ల్స్‌కు షార్జా వేదిక కానుంది. ఇక ఫైన‌ల్ దుబాయ్ వేదిక‌గా అక్టోబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.