
- అగ్నిప్రమాదంలో చిన్నారులను కాపాడిన ఘటనలో కార్మికులను సత్కరించిన ఆ దేశ ప్రభుత్వం
సింగపూర్: సింగపూర్‌లోని స్కూల్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులను కాపాడిన భారతీయ వలస కార్మికులను ఆ దేశ ప్రభుత్వం సత్కరించింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే పిల్లలను రక్షించిన కార్మికుల ధైర్యసాహసాలను మెచ్చుకుంది. వీరు కాపాడిన పిల్లల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (8) కూడా ఉన్నాడు.
ఈ మేరకు వలస కార్మికుల శ్రేయస్సును చూసుకునే మ్యాన్‌పవర్ మినిస్ట్రీ.. అష్యూరెన్స్, కేర్ అండ్ ఎంగేజ్మెంట్ (ఏసీఈ) గ్రూప్ నుంచి ఫ్రెండ్స్ ఆఫ్ ఏసీఈ నాణేలను ఇందర్‌జిత్ సింగ్, సుబ్రమణియన్ శరణ్‌రాజ్, నాగరాజన్ అన్బరసన్, శిసామి విజయరాజ్‌లకు అంజేసింది. ఘటన జరిగిన వెంటనే వీరు స్పందించడం వల్లే పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సింగపూర్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులో ఓ బిల్డింగ్ ఉంది. అందులో పలు షాపులతో పాటు స్కూల్ కూడా నడుస్తుంది. ఏప్రిల్ 8న ప్రమాదవశాత్తు ఆ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ అలుముకోవడంతో పిల్లలు భయంతో కేకలు వేశారు. అక్కడే మరో బిల్డింగ్‌లో పనిచేస్తున్న భారత కార్మికులు చిన్నారుల కేకలు విన్నారు. వెంటనే నిచ్చెన సహాయంతో చిన్నారులు ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లి, 10 మంది పిల్లలను కాపాడారు. 10 నిమిషాల తర్వాత సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ బాలిక ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి చెందింది.