ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. చాలామంది వివిధ రకాల వీడియోలు, రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. యువత రీల్స్ పిచ్చి ఎప్పుడో పరాకాష్టకు చేరింది. కేవలం యువతీ యువకులే కాదు వివాహితులు సైతం ఈ రీల్స్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. రీల్స్‌లో రోడ్లపై, వాహనాలపై చాలా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. అయితే అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. చాలా సందర్భాలలో ప్రమాదపు అంచుల్లో యువతీ యువకులు రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ రీల్స్ మోజులో పడి వరంగల్ జిల్లా నర్సంపేటలో అజయ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అందరికన్నా వినూత్నంగా చేయాలని మెడకు ఉరి బిగించుకొని రీల్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తాడు మెడకు బిగుసుకొని మరణించాడు. మహారాష్ట్రలోని పుణెలో షార్ట్ వీడియో చిత్రీకరణ కోసం ఓ యువతి మరో యువకుడి సాయంతో అత్యంత ప్రమాదకరమైన రీతిలో భవంతిపై నుంచి వేలాడింది.
జీవితంలో భాగమైన సోషల్ మీడియా
ఔరంగాబాద్‌లో రీల్స్ మోజులో పడి శ్వేత అనే ఓ యువతి దుర్మరణం పాలైంది . డ్రైవింగ్ రాకున్నా.. కొండపై తొలిసారిగా కారు నడుపుతూ, అందులోనూ రివర్స్ తీస్తూ రీల్‌కు పోజులిచ్చింది. అయితే బ్రేక్‌కు బదులు యాగ్జిలరేటర్ తొక్కడంతో కారు కొండ పైనుంచి లోయలో పడిపోయింది. స్పాట్ లోనే శ్వేత చనిపోయింది. ఇవే కాదు రీల్స్ కు సంబంధించి ఎన్నో ఘటనలు ఉన్నాయి. నిజానికి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక లైఫ్ స్టైల్ మారిపోయింది. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ ఫోన్స్ దొరుకుతుండడంతో వీటి వాడకం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా నిత్య జీవితంలో భాగమైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. లైకుల కోసం, కామెంట్ల కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి రీల్స్ చేస్తున్నామనే సంగతి మరిచిపోతున్నారు. కొందరు డ్యాన్సులతో, మరికొందరు ఫన్నీ వీడియోస్ తో, క్రియేటివ్ కంటెంట్ తో రీల్స్ చేసి సెలబ్రిటీ అయిపోవాలని ఒళ్లు మరచి రీల్స్ చేస్తున్నారు. నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ పబ్లిక్ కు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారు.
రీల్స్ తో అనర్థాలు
రీల్స్ చేసేవారికి ప్రమాదాలు పొంచి ఉంటే, వాటిని చూసేవారికి కూడా మరోరూపంలో నష్టాలు ఉన్నాయి. రీల్స్ తో పాటు రకరకాల యాడ్స్ వస్తుంటాయి. పొరపాటున వీటి బారిన పడితే డబ్బులు పోవడం ఖాయం. కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర వసంత్ నగర్ లో ఉండే నరేష్ స్టాక్ మార్కెట్ యాడ్ చూసి 21 లక్షలు కోల్పోయాడు. కొన్ని రోజులు లాభాలు ఇచ్చినట్టు చేసిన మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన కంపెనీ తర్వాత చేతులెత్తేసింది. దీంతో నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా మోజులో పడి చాలామంది తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదు. నెట్టింట్లో వచ్చే లైక్స్, కామెంట్ల కోసం.. కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో గొడవలు పడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కొందరైతే దాడి చేయడానికి, చివరికి హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. బిహార్ బెగుసరైలో ఒక మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయొద్దని చెప్పినందుకు కుటుంబ సభ్యులతో కలిసి భర్తని అతి కిరాతకంగా హతమార్చింది. రీల్స్ పేరుతో యువత చేసే పనులు కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తున్నా మరికొన్నిసార్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని గైడ్ చేయాలి.
- కూర సంతోష్,
సీనియర్ జరన్లిస్ట్