అమెరికాలో ఉన్న తమ కొడుకును చూద్దామని ఓ వృద్ధ దంపతులు అక్కడికి టూరిస్ట్ వీసాపై వెళ్లారట. అక్కడే ఉద్యోగం చేస్తున్న ఆ కొడుకు స్నేహితుడు తల్లిదండ్రులతోపాటు భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. వాళ్లింట్లో భోజనం ముగించి, చేయి కడుక్కునేటపుడు తండ్రి చెవిలో కొడుకు మెల్లగా ‘నాన్నా! మనం వీళ్లింట్లో భోజనం చేసినందుకు మా స్నేహితుడికి థ్యాంక్స్ చెప్పు’ అన్నాట్ట. వెంటనే ఆ పెద్దాయన ‘బాబూ! మాకు మంచి భోజనం పెట్టినందుకు థ్యాంక్స్’ అన్నాట్ట. ఆ తర్వాత టూరిస్ట్ వీసా గడువు ముగియగానే వృద్ధులు భారత్కు వచ్చేశారు. కొన్నాళ్లకు కొడుకు తండ్రికి ఫోన్ చేసి ‘నాన్నా! మనకు భోజనం పెట్టిన నా స్నేహితుడు ఇండియాకు పనిమీద వస్తున్నాడు. ఓ పది రోజులు మనింట్లోనే ఉంటాడు. మీరు అతడిని బాగా చూసుకోవాలి’ అని చెప్పాడు. ఆ అబ్బాయి వచ్చి పది రోజులు ఈ వృద్ధ దంపతుల దగ్గరే ఉండి తన పనులు చేసుకున్నాడు. వాళ్లు అతనికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. తిరిగి అతను వెళ్లిపోయే ముందు కార్లో కూర్చోవడానికి వెళ్తుంటే ఈ వృద్ధుడు ‘బాబూ! మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించినందుకు థ్యాంక్స్’ అన్నాడట. వెంటనే అతను ‘ఇదేమిటి..? ఆ రోజు అమెరికాలో మా ఇంట్లో భోజనం చేసినపుడు మీరే థ్యాంక్స్ చెప్పారు. ఈ రోజు నాకు భోజనం పెట్టి మీరే థ్యాంక్స్ చెబుతున్నారు’ అన్నాడట. ఈ దేశంలో అన్నం తిన్నవాళ్లకే పెట్టినవారు థ్యాంక్స్ చెబుతారు. ‘అతిథి దేవోభవ’ అన్న ప్రాథమిక సూత్రం నుంచి ఇది పుట్టింది. ఇదే భారతీయ సంస్కృతి అన్నాడట. ఈ భారతీయ సంస్కృతి ప్రాచీనమైనదేగాక, మహోన్నతమైనదని ప్రాచ్యులే గాక, ఎందరో పాశ్చాత్యులు కూడా తమ అభిప్రాయం వెలిబుచ్చారు.
నాగరికతలకు జీవం పోసి..
భారతీయత ఇక్కడే కాదు.. ప్రపంచానికే వెలుగు చూపింది. కొత్తగా పుట్టిన అన్ని మతాలకూ ఆధారమైంది. ఇందులోంచి స్వీకరించినవి కొన్ని, స్వీకరించకూడదనుకొన్నవి మరికొన్ని కలిసి ఆయా మతాల ప్రాథమిక సూత్రాలయ్యాయి. అందుకే భారతీయ నాగరికత, సంస్కృతుల వైశిష్ట్యాన్ని ఇష్టం ఉన్నా, లేకున్నా మాక్స్ ముల్లర్ లాంటివాడు ‘వాట్ఇండియా కెన్ టీచ్ అస్’’ అనే పేరుతో ఉపన్యాసాల పరంపరను పాశ్చాత్య దేశాలకు అందించాడు. హిందూ ప్రాచీన సంస్కృతి ముందు గ్రీకుల, రోమనుల, అరబ్బుల, పారసీకుల సంస్కృతులు ‘బోన్సాయ్’ మొక్కలే! ప్రపంచంలోని ఎన్నో మతాలకు, సంస్కృతులకు, నాగరికతలకు ఇక్కడి నుంచే జీవం అందింది. ఇప్పటికీ ఎన్నో దేశాలు మతం ఆధారంగా మనకు సరిపోలకున్నా సంస్కృతిని అలాగే ఉంచుకున్నాయి. ఇండోనేషియా ప్రపంచంలోనే అతి ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న దేశం. అక్కడ రామాయణ ఘట్టాలను తెలిపే ‘రామలీల’ ఏటా జరుగుతుంది. అలాగే ఎన్నో భారతీయ గ్రంథాలు ఇతర దేశాలకు దిక్సూచి అయ్యాయి. జర్మన్ వాళ్ల వైద్య విభాగంలో ఒకదానికి చరకుడి పేర ‘చర్కాలజీ’ అని పేరు పెట్టుకున్నారు. ఇండోనేషియా వాళ్ల ఏయిర్వేస్కి ‘గరుడ’ అని పెట్టుకుని, వాళ్ల కరెన్సీ నోట్లపై ‘గణేశుడి’ బొమ్మను చిత్రించుకున్నారు. బుద్ధుడు పుట్టిన ఈ నేల నుంచి ధ్యాన విద్య ప్రపంచంలోకి వెళ్లింది. దీని ప్రభావంతోనే పాశ్చాత్య దేశాల్లో ‘జెన్ సాధువులు’ పుట్టుకొచ్చారు. వాళ్లలో అన్నీ మన అవధూతల లక్షణాలే.
రమణ మహర్షి
పాశ్చాత్య పాత్రికేయుడు, ఆధ్యాత్మిక పరిశోధకుడు పాల్ బ్రంటన్ రాసిన ‘ఏ సీక్రెట్ సెర్చ్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకం పాశ్చాత్యులను భారత్ వైపు నడిపించింది. మేడం బ్లావెట్ స్కీ, సిస్టర్ నివేదిత వంటి ఎందరో ఈ సంస్కృతిపై మక్కువ పెంచుకొని ఈ మట్టితో మమేకమయ్యారు. పాల్ బ్రంటన్ తన రచన కోసం భారతదేశం అంతా ఓ హేతువాదిలా అన్వేషణ చేస్తాడు. ఎందరో సిద్ధ పురుషులను కలుస్తాడు. చివరకు రమణ మహర్షి దగ్గర అతడు శాంతి పొందుతాడు. ఆ తర్వాత రమణ మహర్షి ఆలోచనలు పాశ్చాత్య ప్రపంచంలోకి విస్తరించాయి. జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, స్వామి రామాలు తమ గ్రంథాలు, సాధనల ద్వారా పాశ్చాత్య లోకాన్ని ఆకర్షించారు. ఈ రోజుకూ అరుణాచలంలో ఎప్పుడూ విదేశీయులు కనిపిస్తారు. పాశ్చాత్యులను విశేషంగా ఆకర్షించిన వారిలో నిసర్గదత్త మహరాజ్ ఒకరు. గొప్ప ఆత్మజ్ఞానిగా పేరొందిన ఆయన ఇల్లు చిన్న సందులో ఉన్నా, విమానాలు దిగి నేరుగా ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చేవారు.
మన కండ్లముందే ఎందరో యోగులు
ఓషోగా పేరొందిన ఆచార్య రజనీశ్ చెప్పినంతగా ప్రాచ్య -పాశ్చాత్యులు వేదాంతం మరెవరూ చెప్పలేదు. వందలాది మంది తత్త్వవేత్తలను ఆయన ఆధ్యాత్మిక లోకానికి రుచి చూపించాడు. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో చర్చిలను కొనుగోలు చేసి కృష్ణ మందిరాలుగా మార్చుతున్న ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి. భక్తి వేదాంత స్వామి పాశ్చాత్య ప్రపంచాన్ని కృష్ణమయం చేశారు. తన ప్రౌట్ ఫిలాసఫీ ద్వారా ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ సృష్టించిన ప్రభాత్ రంజన్ సర్కార్ (ఆనందమూర్తి) సిద్ధాంతం పాశ్చాత్యులను శివయోగం తెలుసుకునేలా చేసింది. అతి పెద్ద సంస్థగా బ్రహ్మ బాబా స్థాపించిన బ్రహ్మ కుమారీస్ ఎలా సముద్రాలను దాటి దూసుకుపోతుందో మనం కళ్లారా చూస్తున్నాం. భగవాన్ సత్యసాయి పాశ్చాత్యులకు భక్తి పరిమళాలను పంచిపెట్టారు. మహర్షి మహేశ్ యోగి పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలను స్థాపించారు. రాందేవ్, శ్రీశ్రీ రవిశంకర్, మాతా అమృతానందమయి వంటివారు ఇవాళ ఆధ్యాత్మిక క్షేత్రంలో అందుకోలేనంత దూరం నడిచారు. ఇదంతా భారతీయం. ఈ రోజుకూ మన కళ్లముందు సంచరించే యోగులు ఎందరో ఉన్నారు. వారు చేస్తున్న ప్రబోధాలు సమాజాన్ని నైతిక చట్రంలో బంధిస్తున్నాయి. నిరాహార యోగినిగా మాతా మాణికేశ్వరి సాత్విక ఆహార ప్రాధాన్యం లోకానికి అందిస్తున్నారు. ఆత్మజ్ఞానిగా శ్రీ గురు గెంటేల వేంకటరమణ ప్రేమను పంచుతున్నారు. మనం జీవించి ఉన్న గురువులను పట్టించుకోం. గెంటేల వేంకటరమణులు మరో రమణ మహర్షిలా తత్వ ప్రబోధం చేస్తున్నారు. వారి ‘ఆత్మబోధ’ మనం అనుకునే, చెప్పుకొనే గొప్ప గురువులకేం తీసిపోదు.
పాశ్చాత్య సమాజంపై మన గ్రంథాల ప్రభావం
ఆధునిక కాలంలో స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనం కోసం 31 మే 1893లో చికాగో వెళ్లారు. ఆధునిక, ప్రాచీన మహర్షుల సందేశాన్ని, ఇక్కడి మహాభక్తుల సందేశాన్ని, వేదాంత సారాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానందదే. స్వామి హైందవాలయాలకు, బౌద్ధ ఆరామాలకు ఉన్న సారూప్యాన్ని గమనించాడు. జపాన్ లోని టోక్యో, యోకోహామాలను చూసి హైందవ బౌద్ధ సంస్కృతుల విశాలత్వాన్ని పరిశీలించాడు. వివేకానందుడు చూపిన బాట వల్ల ఆయన తర్వాత ఎందరో పాశ్చాత్య దేశాల బాట పట్టారు. స్వామి రామతీర్థ అద్వైతామృత రసాన్ని పాశ్చాత్యులకు పంచిపెట్టి మత్తులో ముంచాడు. వివేకానందుడు పాశ్చాత్య దేశాలకు వెళ్లి వచ్చాక 25 ఏళ్ల తర్వాత మరొక గొప్ప యోగి పరమహంస యోగానంద అమెరికాలో అడుగుపెట్టాడు. ఆయన యోగుల జీవితాలను, శాస్త్రాలను క్షుణ్నంగా పరిశీలించి రచించిన ‘ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువదించబడి లక్షలాది కాపీలు అమ్ముడుపోయింది. పాశ్చాత్య సమాజంపై ఈ గ్రంథం ప్రభావం అనన్య సామాన్యం.
మన మేధావుల తీరు మారదా?
ఇలా ఎందరో పాశ్చాత్యులు మనవైపు చూస్తుంటే, ఇక్కడివారు మాత్రం అస్తమిస్తున్న సూర్యుడి కోసం అటువైపు ముఖం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ల పేరుతో కొందరు విపరీతమైన మత మార్పిడి జరుపుతూ దేశంలో అంతర్గత శాంతి లేకుండా చేస్తున్నారు. అక్కడ అమ్ముకున్న చర్చిల ధనాన్ని ఇక్కడ విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు. మోదీ అధికారంలోకి వచ్చి ఎన్జీవోలను కట్టడి చేయగానే ఆయా సంస్థల కార్యకలాపాలు తగ్గిపోయాయి. దాంతో మోదీపై కత్తిగట్టిన ఈ గ్యాంగంతా ఇప్పుడు కులం ఉచ్చును కార్యాచరణగా ఎంచుకున్నాయి. ఎక్కడైనా పార్టీలపై కక్ష ఉంటుంది గానీ, వ్యక్తులపై యుద్ధం చేస్తారా? రకరకాల కొత్త అస్తిత్వాలను సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టించేటట్లు చేసి, ఇక్కడి హిందువులను అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. ‘ఒలింపిక్స్లో మొదటి బహుమతి పొందిన ఛాంపియన్ ఇంటివెనుక గుంతలో పడి చచ్చినట్టు’.. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంటే, మన మేధావులు మాత్రం ఉదయం లేచింది మొదలు హిందూత్వను ఎలా బోనులో నిలబెట్టాలని చూస్తున్నారు. గజనీ, ఘోరీ, నాదిర్షా, ఔరంగజేబులే హిందూ మతాన్ని ఏమీ చేయలేకపోయారు. మార్క్స్, మావో చతికిలబడ్డారు. ఇపుడు కొన్ని ‘మిణుగురు పురుగులు’ దాడి చేస్తే, సహించే శక్తి ఈ దేశానికి ఉందనేది చారిత్రక సత్యం.
- డా. పి. భాస్కర యోగి, సోషల్ ఎనలిస్ట్