స్విస్ బ్యాంకుల్లో తగ్గుతున్న ఇండియన్ల డిపాజిట్లు

స్విస్ బ్యాంకుల్లో తగ్గుతున్న ఇండియన్ల డిపాజిట్లు

న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో  ఇండియన్ కంపెనీలు, వ్యక్తులు చేసిన మొత్తం డిపాజిట్లు  కిందటేడాది 70 శాతం (ఏడాది ప్రాతిపదికన) మేర తగ్గాయి. నాలుగేళ్ల కనిష్టమైన రూ.9,771 కోట్లకు (1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌లు) దిగొచ్చాయి. ఇండియాలో ఉన్న స్విస్ బ్యాంకుల బ్రాంచుల్లోని డిపాజిట్లు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ కంపెనీలు, వ్యక్తుల డిపాజిట్లు వరుసగా రెండో ఏడాదిలోనూ తగ్గాయని స్విస్ నేషనల్  బ్యాంక్ పేర్కొంది. 

ఈ డిపాజిట్లు 2021 లో  14 ఏళ్ల గరిష్టమైన 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌లకు (సుమారు రూ.36 వేల కోట్లకు) చేరుకున్నాయి. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర అసెట్లలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు పడిపోవడంతో స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల ఫండ్స్ తగ్గాయని అంచనా.  స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉన్న ఇండియన్ల బ్లాక్ మనీ  ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో కలిసి లేదు. 

అలానే  థర్డ్ పార్టీల ద్వారా స్విస్  బ్యాంకుల్లో ఉన్న  ఇండియన్లు, ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐల డబ్బులు కూడా పైన పేర్కొన్న ఫండ్స్‌‌‌‌‌‌‌‌లో కలిసి లేవు. 2006  లో స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ కంపెనీలు, వ్యక్తుల డిపాజిట్లు 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా రికార్డయ్యాయి.  ఆ తర్వాత నుంచి పడుతూ వచ్చాయి. 2011, 2013, 2017, 2020, 2021 లో పెరిగినా, 2022, 2023 లో తగ్గాయి.