- కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ. 2.6 లక్షల కోట్లకు ఔట్‌వార్డ్ రెమిటెన్స్
- విదేశీ ట్రిప్‌లతోనే ఎక్కువ : ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: విదేశాలకు వెళుతున్న ఇండియన్లు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఆర్‌బీఐ రిపోర్ట్ ప్రకారం, గత ఐదేళ్లలో విదేశీ ప్రయాణాలకు చేసే ఖర్చులు మూడు రెట్లు పెరిగాయి. విదేశాలకు వెళ్లే వారు పెరగడంతో ఇండియా నుంచి బయట దేశాలకు పోతున్న డాలర్లు (ఔట్‌వార్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెమిటెన్స్–ఓఎఫ్‌ఆర్‌ఈ) కూడా భారీగా పెరిగాయి. 2023–24 లో నెలకు సగటున 1.42 బిలియన్ డాలర్లు (రూ.12,500 కోట్లు) ఇండియా నుంచి వెళ్లిపోయాయి. ఐదేళ్ల క్రితం అంటే 2018–19 లో నెలకు కేవలం 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు) విదేశాలకు వెళ్లాయి.
ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2023–24 లో ఏకంగా 17 బిలియన్ డాలర్ల (రూ.1,41,800 కోట్ల) ను ఇండియన్లు విదేశీ ట్రిప్‌ల కోసం విత్‌డ్రా చేశారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 13.66 బిలియన్ డాలర్లు (రూ.11,400 కోట్లు) గా రికార్డయ్యింది. ఇది 24.4 శాతం గ్రోత్‌కు సమానం. ఎల్‌ఆర్‌ఎస్ కింద ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లకు మించి విదేశాలకు పంపకూడదు లేదా ఖర్చు చేయకూడదు. ఇండియా నుంచి డాలర్లు వెళ్లిపోతుండడంలో ప్రయాణాల వాటానే ఎక్కువగా ఉంది.
కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి రెమిట్ అయిన అమౌంట్‌లో 53.6 శాతం ట్రావెల్‌దే ఉంది. 2018–19 లో 35 శాతంగా రికార్డయ్యింది. ప్రజల ఆదాయాలు పెరుగుతుండడంతో విదేశాలకు ఇండియన్లు వెళ్లే ట్రిప్‌లు పెరుగుతున్నాయి. కరోనా రిస్ట్రిక్షన్లు ఎత్తేశాక ఈ ట్రెండ్ మరింత పెరిగింది. ఇండియన్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా పెరిగింది.
కిందటి ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెల సగటున 100 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టారు. 2022–23 మొత్తం ఆర్థిక సంవత్సరంలో వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1.25 బిలియన్ డాలర్లు గా రికార్డయ్యింది. విదేశాల్లో చదువుల కోసం 3.47 బిలియన్ డాలర్లు, బంధువుల మెయింటెనెన్స్ కోసం 4.61 బిలియన్ డాలర్లు వెళ్లిపోయాయి. మొత్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కింద ఇండియా నుంచి రెమిట్ అయిన అమౌంట్ 31.73 బిలియన్ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్ల) కు పెరిగింది.