
- ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్‌కి తరలింపు
- లీడర్లు, సినీ, ఇతర ప్రముఖులపెట్టుబడులకు అడ్డాగా యూఏఈ
- కేదార్‌నాథ్ అనుమానాస్పద మృతితో బయటకొస్తున్న బాగోతాలు
- అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్‌లో ఇన్వెస్ట్మెంట్
- ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్‌లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు
- నెలలో కనీసం నాలుగైదుసార్లు దుబాయ్‌కి చక్కర్లు
- బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్
- ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఐటీ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్‌ని అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో సంపాదించిన సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్‌కి తరలించి.. అక్కడ దందాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, గోల్డ్ బిజినెస్, చమురు బావులు, ఇతరత్రా రంగాల్లో బినామీల పేరుతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకులో దాచుకునేవారు. కానీ ఇప్పుడు యూఏఈకి షిఫ్ట్ అయ్యారు.
రియల్ భూమ్ పెంచి.. సంపాదించి..
గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల భూములను కూడబెట్టుకున్నారు. వందల ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధరకు కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు. భూదాన్, వక్ఫ్ భూములు, ఎనిమీ ల్యాండ్స్, స్వాతంత్ర్య సమరయోధుల భూములను సైతం అడ్డదారిలో హస్తగతం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీవో 111 పరిధిలో భూములుకొన్నాక.. జీవో ఎత్తివేస్తామని ప్రకటన చేసి, ఎక్కువ రేటుకు అమ్ముకున్నారని, ఒక ఎకరా భూమి రూ.100 కోట్లు పలికేలా చేసి చుట్టూ ఉన్న తమ భూములకు రేట్లు పెంచుకున్నారనే వార్తలు వచ్చాయి.
హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో 59 జీవో కింద అప్లికేషన్లు పెట్టుకొని ఏకంగా రూ. 2 వేల కోట్ల విలువైన భూములను కొట్టేశారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో నాటి సీఎంకు దగ్గరగా ఉన్న అప్పటి ఎంపీతో పాటు పలువురు అప్పటి మంత్రులు, ఇద్దరు అప్పటి ఎమ్మెల్సీలపైనా ఫిర్యాదులు వచ్చాయి. ఇలా అడ్డదారిలో సంపాదించిన భూములను బినామీల ద్వారా వెంచర్లు చేసి అమ్మిన నేతలంతా ఆ సొమ్మును దుబాయ్ సహా బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. అప్పట్లో నేతలు, వారి అనుచరులు చెప్పిన రియల్ బూమ్ నిజమేనని నమ్మి, వారు వేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్న సామాన్యులు ఇప్పుడు అమ్ముకో లేక అల్లాడుతున్నారు. రియల్‌ఎస్టేట్‌కు తోడు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టుల ద్వారా ఇసుక, గ్రానై ట్ మైనింగ్ ద్వారా సంపాదించిన మొత్తంలో చాలా భాగం దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది.
దుబాయ్‌లో ప్లాట్ల కొనుగోలుతో మొదలుపెట్టి వెంచర్లు వేసే స్థాయికి..
దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా ఈజీ. ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా అక్కడ నేరుగా ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చు. పెట్టుబడులకు సంబంధించిన డబ్బు వివరాలను లెక్క చెప్పాల్సి న అవసరం కూడా పెద్దగా ఉండదు. పైగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి దశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో జనం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితులపై తెలంగాణ నేతలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. దీంతో యూఏఈలో చిన్నచిన్న వ్యాపారాలతో తమ దందాను మొదలుపెట్టిన నేతలు.. క్రమంగా విస్త రించారు.
దుబాయ్‌లో మొదట హైరైజ్ బిల్డింగ్‌లలో చిన్నచిన్న ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుతో ప్రారంభించి.. ఇప్పుడు రియల్ ఎస్టేట్రంగంలోకి దిగారు. బంగారం కొనుగోలు చేసే స్థాయి నుంచి జ్యుయెల్లరీస్ పెట్టే స్థాయికి ఎదిగారు. హోటల్స్, చమురు బావుల్లోనూ పెట్టుబడులు పెట్టి దుబాయ్‌లో స్థిరపడ్డవారి సాయంతో వాటిని నిర్వహిస్తున్నారు. అక్కడ సంపాదించిన డబ్బు ను దాదాపు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, వివిధ మార్గాల్లో ఇండియాకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత పదేండ్లలో దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టిన భారతీయుల్లో ఎక్కువ శాతం మంది తెలంగాణ వాళ్లే ఉన్నట్లు ఇటీవల ఓ నేషనల్ సర్వే నివేదిక వెల్లడించింది.
కేదార్‌నాథ్‌కు మాజీ ఎమ్మెల్యేలతో లింకులు..!
పొలిటికల్, సినీ, ఫార్మా, రియల్ఎస్టేట్ తదితరరంగాల ప్రముఖులు, వారి బినామీలు, బ్రోకర్ల చేతుల్లోకి వందలు, వేల కోట్లు వస్తుండడంతో పబ్స్, డ్రగ్స్కల్చర్ పెరిగి ఇల్లీగల్ వ్యవహారాలకు దారితీస్తున్నట్లు గతంలో సిట్, సీఐడీ గుర్తించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న పబ్బుల్లో 75శాతం రాజకీయ నాయకు ల చేతుల్లోనే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుడు ఫిబ్రవరిలో గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కు చెందిన వివేకానంద పార్టీ ఆర్గనైజ్ చేశాడు. ఆ పార్టీలో కొకైన్ వినియోగించారు. ఈ కేసులో వివేకానందతో పాటు అతడి ఫ్రెండ్స్ నిర్భయ్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కేదార్‌నాథ్ సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కేదార్‌నాథ్‌కు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ఓ మాజీ ఎమ్మెల్యేతో అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు గోవాలో జరిగే ఈవెంట్స్‌ను కేదార్‌నాథ్ ఆర్గనైజ్ చేసేవాడని తెలిసింది. అతడు నిరుడు దుబాయ్‌కి మకాం మార్చాడు. అక్కడే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఈక్రమంలో ఆయన అనుమానాస్పద మరణం కలకలం రేపుతున్నది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఓ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరు నిరుడు జనవరి నుంచి దుబాయ్ లో ఉంటున్నారు. కొడుకును పోలీస్ కేసు నుంచి తప్పించారనే ఆరోపణపై హైదరాబాద్ పోలీసులు ఆయన మీద కూడా కేసు పెట్టారు. రూ. 80 కోట్ల విలువైన సీఎంఆర్ రైస్ మాయం చేసిన కేసులోనూ సదరు మాజీ ఎమ్మెల్యేపై సివిల్ సప్లైశాఖ కేసు నమోదు చేసింది.
దుబాయ్ నుంచి వస్తే అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో ఆయన అక్కడే ఉంటున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో నాటి కీలకమైన ఓ మంత్రికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు దుబాయ్‌లోనే ఉంటూ.. అక్కడ ఆ మాజీ మంత్రి వ్యవహారాలను కూడా ఆయన చూసుకుంటున్నట్లు టాక్. అదే మాజీ మంత్రికి కుడిభుజం లాంటి మరో మాజీ ఎమ్మెల్యేకు సినీ రంగంతో సంబంధాలున్నాయి. ఈయన కూడా దుబాయ్ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేదార్‌నాథ్ మృతి కేసును దుబాయ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే.. తెలంగాణ నేతలతోపాటు పలు సినీ ప్రముఖుల వ్యవహారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంద న్న టాక్ వినిపిస్తున్నది.
ఎన్నికల్లో ఓడిపోయాకఅక్కడే తిష్టవేసి..!
గత సర్కార్‌లో చక్రం తిప్పిన ఓ పది మంది కీలక నేతలు, వారి అనుచరులు దుబాయ్‌లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు, బ్రోకర్లతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పర్యవేక్షణ కోసం నెలలో కనీసం మూడు, నాలుగు సార్లు ఈ నేతలంతా దుబాయ్‌కి చక్కర్లు కొట్టిరావడం షరా మామూలైంది. ఓ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలైతే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్ లోనే తిష్టవేసి.. వ్యాపారాలు సాగిస్తున్నారు. డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్‌నాథ్ ఇటీవల దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో లీడర్ల దందాల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది.
ఓ మాజీ ఎమ్మెల్యేకు కేదార్‌నాథ్ బినామీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలు ఉన్నాయి. కేదార్‌నాథ్‌ది హత్యే అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే చాన్స్ ఉందని పోలీస్ వర్గాలు అంటున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా..!
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ప్యాన్ ఇండియా పేరుతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఆ మధ్య ఓ తెలుగు సినిమా వెయ్యి కోట్లకు పైగా రాబట్టుకుంటే.. ఇటీవల విడుదలైన మరో సినిమా రూ.2 వేల కోట్లకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇవిగాక రూ.100 కోట్ల నుంచి 500 కోట్ల దాకా కలెక్షన్లు తెచ్చిన సినిమాలు పది దాకా ఉన్నాయి. నిజానికి ఆయా సినిమాలు ఆర్జిస్తున్న లాభాల్లో మెజారిటీ వాటా నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోల చేతుల్లోకే వెళ్తుంది. ఈ సొమ్మంతా హవాలా రూపంలో దేశ సరి హద్దులు దాటుతున్నది.
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్ రంగంతో పాటు హాంకాం గ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో వివిధ వ్యాపారాల్లో సినీ ప్రముఖులు పెట్టు బడులు పెడ్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో అనేక ఆర్థిక అవకతవకలు జరుగుతుండడంతో తెలుగు సినీ ఇండస్ట్రీపై ఇటు ఐటీ, అటు ఈడీ దృష్టి పెట్టాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, హీరోల ఇండ్లలో ఐటీ శాఖ వరుసదాడులు నిర్వహిస్తున్నది. దుబాయ్, ఇతర దేశాల్లో పెట్టుబడులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు పలు ఆధారాలు లభించినట్లు తెలిసింది.