ముప్పై ఏండ్లలో పదేండ్లు ఎక్కువైంది
59.6 నుంచి 70.8 ఏండ్లకు పెరిగిన ఆయుష్షు
జబ్బులూ పెరుగుతున్నయ్
గుండె జబ్బులు, కేన్సర్ వంటివే ఎక్కువ
కరోనా ముప్పును మరింత పెంచుతున్న ఎన్సీడీలు
లాన్సెట్ స్టడీలో వెల్లడి
‘వందేండ్లు సల్లగ బతుకు బిడ్డ’.. చిన్నోళ్లకు పెద్దోళ్లు ఇచ్చే దీవెన ఇది. వందేండ్లు బతుకుతమో లేదో తెల్వదుగానీ.. మన దేశపోళ్ల ఆయువు మాత్రం పెరిగింది. ముప్పై ఏండ్లలో పదేండ్లు ఎక్కువైంది. జీవిత కాలంతో పాటే బీమార్లూ ఎక్కువైతున్నయ్. అంటు వ్యాధులు తగ్గినా.. వేరే రోగాలు దాడి చేస్తున్నయ్. హైబీపీ, షుగర్, పొల్యూషన్ వంటివి ప్రాణాలకు పొగ బెడుతున్నయ్. అయినా ఇండియన్స్ ఆయుష్షురేఖ మాత్రం పెరిగింది. ఇంటర్నేషనల్ సైంటిస్టులు స్టడీ ఇదే చెప్పింది.
న్యూఢిల్లీ: ‘వందేండ్లు సల్లగ బతుకు బిడ్డ’.. చిన్నోళ్లకు పెద్దోళ్లు ఇచ్చే దీవెన ఇది. వందేండ్లు బతుకుతమో లేదో తెల్వదుగానీ.. మన దేశపోళ్ల ఆయువు మాత్రం పెరిగింది. ముప్పై ఏండ్ల కిందట.. అంటే 1990ల మనోళ్ల సగటు జీవిత కాలం 59.6 ఏండ్లుంటే.. 2019 నాటికి అది 70.8 ఏండ్లకు పెరిగింది. లాన్సెట్ జర్నల్ స్టడీలో ఈ విషయం తేలింది. దునియాలోని 204 దేశాలపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్‌పై స్టడీ చేశారు. గాంధీనగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్ట్ శ్రీనివాస్ గోలి కూడా ఆ స్టడీలో పాల్గొన్నారు. మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందించింది. ప్రపంచంలో సగటు ఆయుష్షు 65.4 ఏండ్ల నుంచి 73.5 ఏండ్లకు పెరిగినట్టు సైంటిస్టులు స్టడీలో తేల్చారు. అయితే, ఆయుష్షుతో పాటే జబ్బులూ పెరుగుతున్నాయని, నాన్కమ్యూనికెబుల్ డిసీజెస్ (ఎన్సీడీ– అంటువ్యాధులు కానివి) ఎక్కువవుతున్నాయని సైంటిస్టులు తేల్చారు.
పొల్యూషన్‌తో ఎక్కువ మరణాలు
దేశంలో సగానికిపైగా మరణాలు ఎన్సీడీల వల్లే సంభవిస్తున్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు. 1990లో 29 శాతం మరణాలే ఎన్సీడీల వల్ల సంభవించగా.. 2019 నాటికి అది 58 శాతానికి పెరిగిందని వెల్లడించారు. ఈ జబ్బుల వల్ల ప్రీమెచ్యూర్ డెత్స్ (చిన్న వయసులోనే చనిపోవడం) రెట్టింపయ్యాయని తేల్చారు. 22 శాతం నుంచి 50 శాతానికి పెరిగాయని వివరించారు. ఈ మరణాలకు కారణం గుండెజబ్బులు, సీవోపీడీ, షుగర్, స్ట్రోక్, కండరాల సమస్యలేనని తేల్చారు. 2019లో కాలుష్యం, హైబీపీ, పొగాకు వాడకం, సరైన తిండి లేకపోవడం, షుగర్ వంటి వాటి వల్లే ఎక్కువ మంది చనిపోయారని చెప్పారు. ఆ జాబితాలోనూ పొల్యూషన్ వల్లే ఎక్కువ మంది చనిపోయారన్నారు. ఊబకాయం, షుగర్ వంటి లైఫ్‌స్టైల్ జబ్బులు పెరుగుతున్నాయని అంటున్నారు.
బాలింతల మరణాలు తగ్గినయ్
ఒకప్పుడు దేశంలో ఎక్కువగా ఉన్న బాలింతల మరణాలు ఇప్పుడు చాలా వరకు తగ్గాయని సైంటిస్టులు తేల్చారు. అయితే, గుండె జబ్బులు, కేన్సర్ వంటివి పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎక్కువ మందికి ఎటాక్ చేస్తున్న జబ్బుల జాబితాలో గుండె జబ్బులు ఐదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు టాప్‌లోకి వచ్చిందని చెప్పారు.
కరోనా ముప్పును పెంచుతున్నయ్
దేశంలో 30 ఏళ్లుగా ఊబకాయం, బీపీ, గాలి కాలుష్యం వంటివి బాగా పెరిగాయని, వాటి వల్ల ఇప్పుడు కరోనా ముప్పు బాగా పెరిగిందని సైంటిస్టులు హెచ్చరించారు. కరోనా తీవ్రతను అవి మరింతగా పెంచుతుండడంతో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని వివరించారు. ఎన్సీడీలు నివారించగలిగినవే అయినా.. అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల వాటి ముప్పు భారీగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాల్లో శారీరక శ్రమ తగ్గుతోందని, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారని, దాని వల్ల లైఫ్ స్టైల్ జబ్బులు ఎక్కువవుతున్నాయని అన్నారు. బిహేవియిరల్ రీసెర్చ్‌పై ప్రభుత్వాలు సరిగ్గా ఖర్చు చేయకపోవడమూ పరిస్థితిని దిగజారుస్తోందని చెబుతున్నారు.
హెల్త్ మెరుగైనా.. తిండే సరిగ్గా లేదు
1990 నుంచి ఇప్పటివరకు హెల్త్ విషయంలో దేశం మెరుగుపడినా.. పోషకాహార లోపం మాత్రం వేధిస్తూనే ఉందని సైంటిస్టులు వెల్లడించారు. పోషకాహార లోపం వల్లే పిల్లలు, బాలింతలు ఎక్కువగా చనిపోతున్నారని, వాళ్ల మరణాలకు నంబర్ వన్ కారణం అదేనని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే పోషకాహార లోపానికి సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. లైఫ్‌స్టైల్ డిసీజ్‌లు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 8 రాష్ట్రాల్లో హైబీపీ ఎక్కువగా ఉందని, ఆరోగ్యం పాడు కావడానికి అదే కారణమని సైంటిస్టులు హెచ్చరించారు.
For More News..