నాలుగు నెలల్లో రూ.120 కోట్లు కొట్టేశారు : వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి : ప్రధాని మోదీ

నాలుగు నెలల్లో రూ.120 కోట్లు కొట్టేశారు : వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి : ప్రధాని మోదీ

కుర్చీలో కూర్చోని ముందు కంప్యూటర్ పెట్టుకొని.. ఏం మాత్రం కష్టపడకుండా కోట్టు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మోస పోయేవాళ్లు ఉన్నంత కాలం మేము రకరకాలుగా మోసం చేస్తామన్న తరహాలోనే ఉంది సైబర్ క్రిమినల్స్ తీరు. కేవలం 2024 సంవత్సరంలో ఫస్ట్ నాలుగు నెలల్లోనే డిజటల్ అరెస్టుల ద్వారా రూ.120.3 కోట్లు అమాయకపు ప్రజల నుంచి కాజేశారు. ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ లో మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్టుల గురించి సీరియస్ గా తీసుకోవాలని ప్రజల్ని కోరారు. 

సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులపై అవేర్ నెస్ కలిగి ఉండాలని సూచించారు. ఇలాంటి నేరాలకు అవగాహనతోనే అడ్డుకట్ట వేయగలమని చెప్పారు. దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ ఫోన్ కాల్ గానీ, వీడియో కాల్ గానీ చేయవన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని మన్ కీ బాత్ లో మోదీ సూచించారు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే రూ.120 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని తాజాగా ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది. జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసుల్లో భారతదేశంలోని పౌరులు రూ.120.3 కోట్లు నష్టపోయారని ఈ నివేదిక తెలిపింది. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా మోసాలు, స్కాములు చేస్తున్నారని.. దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ‘డిజిటల్ అరెస్ట్’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైబర్ నేరగాళ్లు ఎలా ఈ క్రైమ్ చేస్తారో వివరించారు. ‘‘సీబీఐ, నార్కోటిక్స్, పోలీస్, ఆర్బీఐ.. ఇలా వివిధ ప్రభుత్వ సంస్థల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తారు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పి, మీ గురించి వాళ్లకు మొత్తం తెలుసని నమ్మిస్తారు. యూనిఫామ్ వేసుకోవడంతో పాటు ఆఫీస్ సెటప్ చేస్తారు. బెదిరిస్తూ, ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా మిమ్మల్ని భయపెడతారు. డబ్బులు ఇస్తే వదిలేస్తామని, లేదంటే అరెస్టు చేస్తామని బెదిరిస్తారు” అని వివరించారు.

మూడు స్టెప్స్ ఫాలో కండి.. 

సైబర్ నేరగాళ్ల నుంచి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడి చాలామంది లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారని మోదీ గుర్తు చేశారు. ‘‘ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడొద్దు. ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా ఫోన్ కాల్/వీడియో కాల్​లో విచారణ చెయ్యదని గుర్తుంచుకోండి. నేను చెప్పే మూడు స్టెప్స్ ను ఫాలో అవ్వండి. మొదటిది స్టాప్.. కాల్ వచ్చినప్పుడు భయపడకండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. 


పర్సనల్ ఇన్ఫర్మేషన్ అస్సలు చెప్పొద్దు. వీలైతే ఆ కాల్​ను రికార్డు చేయండి. రెండోది థింక్.. ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా ఫోన్ చేసి విచారణ చెయ్యదని, డబ్బులు డిమాండ్ చెయ్యదని గుర్తుంచుకోండి. ఇక మూడోది టేక్ యాక్షన్.. మీకు ఎదురైన ఘటనపై సైబర్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. cybercrime.gov.inలో రిపోర్టు చేయండి” అని సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్టు అనే సిస్టమ్ లేదని, ఇదొక మోసమని గుర్తుంచుకోవాలని చెప్పారు. 

‘‘డిజిటల్ అరెస్టు ఫ్రాడ్స్​ను అరికట్టేందుకు దర్యాప్తు సంస్థలు రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాయి. నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. సైబర్ నేరాల నియంత్రణకు ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. అప్పుడే వాటిని నియంత్రించగలం. సైబర్ క్రైమ్ బాధితులు వాటిపై వీలైనంత మందికి అవగాహన కల్పించాలి” అని సూచించారు. ‘SafeDigitalIndia’ హ్యాష్ ట్యాగ్ పేరుతో అవేర్ నెస్ కల్పించాలని పిలుపునిచ్చారు. 

యానిమేషన్, గేమింగ్ రంగాల్లో అభివృద్ధి.. 

ఆత్మనిర్భర్ భారత్ విజయవంతమైందని, ప్రతి సెక్టార్​లోనూ మన దేశం అద్భుతాలు సృష్టిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఒకప్పుడు ఫోన్లు దిగుమతి చేసుకున్న మనం.. ఇప్పుడు ఫోన్ల ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నం. ఒకప్పుడు డిఫెన్స్ ఎక్విప్​మెంట్​ను దిగుమతి చేసుకున్న మనం.. ఇప్పుడు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నం. ఇది న్యూ ఇండియా. మేకిన్ ఇండియా ఇప్పుడు ‘మేక్ ఫర్ ది వరల్డ్’గా మారింది” అని చెప్పారు. 

ALSO READ : స్కెచ్ అదిరింది: పెళ్లైన మూడో రోజే.. పెళ్లాం నగలతో భర్త పరార్

మన దేశ యానిమేషన్ కంటెంట్​కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా చోటా భీమ్, హనుమాన్ లాంటి సిరీస్​లను ప్రస్తావించారు. ఇండియాను గ్లోబల్ యానిమేషన్ పవర్ హౌస్ గా మార్చాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మన దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందుతున్నదని, ఇండియన్ గేమ్స్ కు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వస్తున్నదని పేర్కొన్నారు.