
టెక్నాలజీ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో.. ఆన్‌లైన్ మోసాలు అంతే వేగంగా మారిపోతున్నాయి. కూటి కొరకు కోటి విద్యలు అన్నట్లు.. సైబర్ నేరగాళ్లు డబ్బు దోచేయడానికి రోజుకో కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకూ బ్యాంకు అధికారులమంటూ కేవైసీలు, క్రిడిట్ కార్డుల పేర్లు చెప్పి కోట్లు దోచేసిన ఈ మాయగాళ్లు.. ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే కొరియర్ స్కాం.
మీ పేరుతో వస్తువు కొరియర్ వచ్చిందని మాయమాటలు చెప్పి కోట్లు దోచేస్తున్నారు. దేశంలో రోజుకో ఈ చోట ఈ స్కాం బయటపడుతోంది. అంతా అయిపోయాక లక్షల డబ్బు పోగొట్టుకొన్న బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి ఈ స్కాం..? ఎలా కొట్టేస్తారు..? అనేది తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి.
ఏంటి కొరియర్ స్కాం..?
ఇదొక కొత్త తరహా మోసం అనమాట. మొదట ఈ స్కామ్ మొదలయ్యేది.. మీ పేరుతో ఒక కొరియర్ వచ్చిందనే మాటలతో. నిజమని నమ్మి అంగీకరించారో మోసపోయినట్లే. నిమిషాల వ్యవధిలోనే అదొక నిషేధిత వస్తువు(డ్రగ్స్ వంటివి) అని మరొక కాల్ వస్తుంది. వాళ్లేమో మీ పేరుపై వచ్చిన కొరియర్ ఓపెన్ చేస్తే డ్రగ్స్ బయటపడ్డాయి. మీ మీద కేసు బుక్ చేయాలి అంటూ భయపెడతారు. మీరు అలాంటివి వద్దని వారిని ప్రాధేయపడటం ద్వారా అందినకాడికి దోచుకుంటారు.
ఎలా బయటపడాలంటే..?
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అలాగే, అత్యాశ పడకూడదు. వాస్తవానికి మీరు ఎలాంటి ఆర్డర్ చేయకపోతే, మీకు కొరియర్ కాల్స్ ఎందుకు వస్తాయి? అనేది ఆలోచించండి. ఒకవేళ వస్తే కనుక అలాంటి కాల్స్ కు సమాధానం ఇవ్వవద్దు. అత్యాశ పడ్డారో.. బాధితుల్లో మీరు ఒకరైనట్లే. ఎలా మోసపోతాం అనుకోకండి. వారు మీ వంటి వాళ్ళను ఎంతో మందిని చూసుంటారు. ఈ కొరియర్ మీది కానియెడల క్యాన్సిల్ చేయాలంటూ మిమ్మల్ని మభ్యపెడతారు. డబ్బు దోచేయడానికి ఇదొక మార్గమనమాట.
సైబర్ క్రైమ్
ఎవరైనా అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడితే ఆ నంబర్ బ్లాక్ చేసి వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఎదుటివారు ఎంతటి వ్యక్తులైనా, వారు ఏం చెప్పినా వినకండి. బ్యాంక్ వివరాలు వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకండి. 155260కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.