- బారులు తీరిన 3 వేల మంది స్టూడెంట్లు.. వీడియో వైరల్
ఒట్టావా: కెనడాలోని ఓ రెస్టారెంట్లో వెయిటర్ జాబ్ కోసం వందలాది మంది విద్యార్థులు క్యూ కట్టారు. ఇంటర్వ్యూ కోసం 3 వేల మంది స్టూడెంట్లు ఆ రెస్టారెంట్ ఎదుట బారులుతీరారు.
ఇందులో మెజారిటీ సంఖ్య మనోళ్లదే కావడం గమనార్హం. కెనడాలోని బ్రాంప్టన్ లో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్.. పార్ట్ టైం పనిచేసేందుకు వెయిటర్లు, సర్వెంట్లు కావాలని, ఇంటర్వ్యూకు రావాలని ప్రకటన ఇచ్చింది.
దీంతో వేలాది మంది స్టూడెంట్లు తమ ప్రొఫైల్‌తో ఇంటర్వ్యూ కోసం వచ్చి లైన్లో నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ట్రూడో.. కెనడాలో నిరుద్యోగం’ అనే హ్యష్ ట్యాగ్‌తో ఎవరో ట్వీట్ చేయగా.. అది ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అయింది.
అయితే, ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను కెనడాకు పంపించాలని కలలుగనే తల్లిదండ్రుల్లోనూ ఈ వీడియో ఆందోళనను రేకెత్తిస్తోంది. కెనడాకు రావాలనుకునే ఇండియన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
చదువుల కోసం ఇక్కడికి వచ్చిన స్టూడెంట్లకు ఇది సర్వసాధారణమేనని మరికొందరు అంటున్నారు. వెస్ట్రన్ కంట్రీస్ లో చదువుతున్న స్టూడెంట్లు పార్ట్ టైం పనిచేస్తూ తమను తాము పోషించుకోవడం వెరీ కామన్ అని పోస్టులు పెడుతున్నారు.
ఇక్కడి పరిస్థితులు కొంతకష్టంగా ఉన్నప్పటికీ, చదువులు పూర్తయ్యాక వారిలో సంపన్న జీవితాన్ని గడిపేవాళ్లే ఎక్కువని ఇంటర్వ్యూకు వచ్చినవాళ్లలో కొందరు తమ అభిప్రాయపడ్డారు.