![దారి వెంట డెడ్‌బాడీలు.. బతికి బయటపడ్తామనుకోలే.. కన్నీళ్లు తెప్పిస్తోన్న ఇండియన్ల గాథ](https://static.v6velugu.com/uploads/2025/02/indians-recalling-how-they-entered-america_86OdYptDvP.jpg)
- గుట్టలెక్కి.. నదులు దాటి.. ప్రాణాలకు తెగించి ప్రయాణం
- అమెరికాలో ప్రవేశించిన తీరును గుర్తుచేసుకున్న ఇండియన్లు
- బతికి బయటపడ్తామనుకోలే..
- దారి వెంట డెడ్‌బాడీలు.. తిండి లేక అవస్థలు
- కండ్ల ముందే సముద్రంలో గల్లంతులు..
- మెక్సికో బార్డర్ గుండా అమెరికాలో అడుగు
న్యూఢిల్లీ: డాలర్లు సంపాదించాలన్న ఆశతో, అమెరికాపై ఉన్న క్రేజ్‌తో పలువురు ఇండియన్లు అక్రమ మార్గంలో ఆ దేశానికి వెళ్లారు. కొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతే.. మరికొందరు తమవాళ్ల కోసం దొడ్డిదారిన అక్కడికి చేరుకున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వాళ్లంతా ఇంటికి చేరుకుంటున్నారు. ఓ విమానంలో 104 మందిని అమెరికా వాపస్పంపింది. అమెరికాలో అడుగుపెట్టేందుకు పడ్డ కష్టాన్ని ఒక్కొక్కరు మీడియాకు వివరించారు. రోజుల తరబడి తిండి, నీళ్లు లేక.. అడవుల గుండా 45 కిలో మీటర్లు ప్రయాణించామని చెప్పారు.
దారి వెంట శవాలు పడి ఉన్నా.. ప్రాణాలు అర చేతిలో పట్టుకుని ముందుకు సాగామన్నారు. ట్రక్కుల్లో పశువుల మాదిరి కుక్కి తీసుకెళ్లారు. సముద్రంలో చిన్న బోటులో గంటల కొద్దీ జర్నీ చేయించారు. బోటు తిరగబడి కండ్ల ముందే కొందరు చనిపోగా.. మరికొందరు అడవిలో ప్రాణాలు వదిలారు. చివరికి మెక్సికో బార్డర్ గుండా అమెరికాలోకి ప్రవేశించినట్లు తెలిపారు.
నమ్మించి మోసం చేసిన ఏజెంట్
అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించి ఏజెంట్ మోసం చేసినట్లు పంజాబ్‌లోని హోషియాపూర్ తహ్లీ గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్ తెలిపాడు. ఏజెంట్‌కు రూ.42 లక్షలు ఇచ్చినట్లు వివరించాడు. వీసా రాలేదని చెప్పడంతో ఢిల్లీ నుంచి ఖతర్.. అక్కడి నుంచి బ్రెజిల్ మీదుగా అమెరికాలో అక్రమంగా ప్రవేశించినట్లు వివరించాడు. ‘‘బ్రెజిల్ చేరితే తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానని ఏజెంట్ చెప్పాడు.
ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నాడు. రెండు రోజులు డాంకీ రూట్లో నడిచాం. కొండలు, గుట్టలు ఎక్కి.. దిగినం. మెక్సికో బార్డర్‌కు తీసుకెళ్లేందుకు ఓ చిన్న బోటులో మమ్మల్ని కుక్కేశారు. 4 గంటల జర్నీ తర్వాత బోటు తిరగబడింది. ఒకతను నా కండ్ల ముందే చనిపోయిండు. మరొకతను అడవిలో ప్రాణాలు వదిలాడు. కొద్దిపాటి బియ్యం ఉంటే.. అవి తింటూ అమెరికాలో అడుగుపెట్టిన’’ అని హర్వీందర్ సింగ్ తెలిపాడు.
చిన్న గాయమైనా.. చనిపోయే పరిస్థితి
అమెరికాలో అక్రమంగా ప్రవేశించే అటవీ మార్గంలో ఎన్నో డెడ్‌బాడీలు చూసినట్లు దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ తెలిపాడు. నడిచేటప్పుడు చిన్న గాయమైనా అది సెప్టిక్ అయ్యేదని.. నీళ్లు, భోజనం లేక చివరికి చనిపోయేవాళ్లని తెలిపాడు. ‘‘ఎగిసిపడుతున్న అలల మధ్య చిన్న బోటులో 15 గంటలు ప్రయాణించాం. కొద్ది సేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగుపెడ్తామన్న టైమ్‌లోనే జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ కావడంతో శ్రమ అంతా వృథా అయ్యింది. మమ్మల్ని 14 రోజులు చీకటి గదుల్లో బంధించారు. అక్కడ వేలాది మంది పంజాబీ కుటుంబాలకు చెందిన యువకులు, పిల్లలు కనిపించారు. అందరిదీ ఒక్కటే దుస్థితి’’ అని సుఖ్‌పాల్ ఆవేదన వ్యక్తంచేశాడు.
మెక్సికో బార్డర్లోనే పట్టుకున్నరు
జస్పాల్ సింగ్ అనే వ్యక్తి.. లీగల్‌గా అమెరికా వెళ్లేందుకు ఏజెంట్‌ను ఆశ్రయించాడు. రూ.30 లక్షలు ముట్టజెప్పగా.. అతను మోసం చేశాడు. ముందుగా జస్పాల్‌ను బ్రెజిల్ తీసుకెళ్లాడు. అక్కడే ఆరు నెలలు ఉంచాడు. తర్వాత అమెరికాలో ఎంటరయ్యే సమయంలోనే బార్డర్ పెట్రోలింగ్ టీమ్‌కు పట్టుబడినట్లు తెలిపాడు. తన కూతురిని కూడా అమెరికా నుంచి పంపించేసినట్లు చండీగఢ్‌కు చెందిన కనుభాయ్ పటేల్ తెలిపాడు.
జారిపడితే అంతే గతి..
పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ‘డాంకీ రూట్’ గురించి చెప్పాడు. తొలుత ఇటలీకి, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారని వెల్లడించాడు. ‘‘బోటులో 15 గంటల ప్రయాణం తర్వాత 40 నుంచి 45 కిలో మీటర్ల అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. కొండలపై నుంచి జారిపడితే బతికే అవకాశం లేదు. గాయాలు అయితే చావాల్సిందే’’ అని ఆ వ్యక్తి తెలిపాడు.