ఫారిన్ నుంచి మనోళ్లు పంపిన పైసలు రూ. 9 లక్షల కోట్లు

  •     సొంత దేశానికి మైగ్రెంట్లు పంపిన డబ్బుల్లో ఇండియా టాప్ 
  •     ‘వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024’లో వెల్లడి

యునైటెడ్ నేషన్స్:  విదేశాలకు వలస వెళ్లిన ఇండియన్లు సొంత దేశంలోని తమ వాళ్లకు రికార్డ్ స్థాయిలో డబ్బులు పంపుతున్నారు. 2022 ఏడాదికి గాను విదేశాల నుంచి ప్రవాస భారతీయులు తమ కుటుంబాలకు పంపిన మొత్తం డబ్బులు ఏకంగా 111 బిలియన్ డాలర్లను దాటిపోయాయి. దీంతో విదేశాల నుంచి వాణిజ్య రహిత చెల్లింపులు(రెమిట్టెన్సెస్) 100 బిలియన్ డాలర్లను దాటిన తొలి దేశంగా ఇండియా నిలిచింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) 2022వ ఏడాది గణాంకాలతో రూపొందించిన ‘వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024’ మంగళవారం విడుదలైంది.

2022లో ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉన్న తమవాళ్లకు మొత్తం 11,100 కోట్ల డాలర్ల(రూ. 9,26,788 కోట్లు) చెల్లింపులు జరిపినట్లు నివేదిక వెల్లడించింది. ఇండియా తర్వాత మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ దేశాలకు అత్యధికంగా రెమిట్టెన్సెస్ నమోదు అయ్యాయని తెలిపింది. ‘‘ఇండియాకు 2010లో 53 బిలియన్ డాలర్ల చెల్లింపులు జరగగా.. 2015లో అది 68 బిలియన్ డాలర్లకు, 2020లో 83 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఆ తర్వాత 2022లో రికార్డ్ స్థాయిలో 111.22 బిలియన్ డాలర్ల చెల్లింపులు జరిగాయి” అని నివేదిక పేర్కొంది. అయితే, అత్యధిక రెమిట్టెన్సెస్ పొందిన టాప్ టెన్ దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 30 బిలియన్ డాలర్లతో పాకిస్తాన్ 6వ స్థానంలో, 21.5 బిలియన్ డాలర్లతో బంగ్లాదేశ్ 8వ ప్లేస్ లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను పోల్చి చూస్తే.. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచే అత్యధికంగా చెల్లింపులు జరిగిన్నట్టు నివేదిక పేర్కొంది.