మాస్కో: వచ్చే ఏడాది నుంచి భారత పర్యాటకులు వీసా లేకుండానే రష్యాకు వెళ్లొచ్చు. 2025 లో స్పింగ్ సీజన్ నుంచి ఇది అమల్లోకి వచ్చే చాన్స్ ఉంది. ఇప్పటికే ఆగస్టు 2023 నుంచి భారత ప్రయాణికులకు రష్యా ఈ – వీసాలను అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే విధానంతో రెండు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
వీసారహిత గ్రూప్ టూరిస్ట్ ఎక్స్ఛేంజీలను ప్రారంభించే లక్ష్యంతో.. వీసా పరిమితులను సడలించడానికి ఈ ఏడాది జూన్‌లో ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి మాస్కో, ఢిల్లీ మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. అలాగే, రష్యా, భారత్ తమ పర్యాటక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం నుంచి రష్యా వెళ్లే సందర్శకుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వ్యాపార పర్యాటకుల కోసం నాన్- సీఐఎస్ దేశాల నుంచి వచ్చిన సందర్శకులలో భారత్ మూడో స్థానంలో ఉంది.