అంతా డెమొక్రాట్ పార్టీ తరఫున బరిలోకి
న్యూయార్క్ అసెంబ్లీకి ఎన్నికైన జెన్నిఫర్ రాజ్‌కుమార్
తొలి దక్షిణాసియా మహిళగా రికార్డ్
ఎగువ సభ (సెనేట్) బరిలో ఓడిన రిక్ మెహతా
రిపబ్లికన్ తరఫున న్యూజెర్సీ నుంచి పోటీ
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో మనోళ్లకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ దేశ దిగువ సభ (లోయర్ హౌస్) అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు నలుగురు ఇండియన్ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. మొదటి సారి బరిలో నిలిచినోళ్లు కొందరు ఓడిపోయారు. ఎక్కువగా డెమొక్రాట్ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నేతలు చేసిన ‘సమోసా కాకస్’ ప్రచారం బాగానే పనిచేసింది. డాక్టర్ ఎమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు మంచి మెజారిటీతో విజయం సాధించారు. మరొక ఇండియన్ డాక్టర్ హిరాల్ తిపిర్నేని లీడింగ్‌లో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండియన్ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. ఇండియన్ అమెరికన్ ఓటర్లే గెలుపోటముల్లో కీలకంగా మారారు.
లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్ (30)ను రాజా కృష్ణమూర్తి ఓడించారు. 47 ఏళ్ల ఆయనకు 71 శాతం ఓట్లు పోలయ్యాయి.
రో ఖన్నా (44).. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన మరో ఇండియన్ రితేశ్ టాండన్(48)ను ఓడించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. మొత్తం 50 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి.
సమోసా కాకస్‌లో చాలా సీనియర్ మెంబర్ అయిన డాక్టర్ ఎమీ బేరా (55).. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన 65 ఏళ్ల బజ్ ప్యాటర్సన్ను 25 శాతం ఓట్ల తేడాతో ఆయన మట్టి కరిపించారు.
2016లో గెలిచిన ప్రమీలా జయపాల్ మరోసారి విజయం సాధించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు గెలిచి చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్ అమెరికన్ ఆమె. మళ్లీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచిన డేవిడ్ ష్వూకెర్ట్పై డెమొక్రాట్ అభ్యర్థి హిరల్ తిపర్నేని లీడింగ్‌లో ఉన్నారు. అరిజోనా ఆరో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఆమె గెలిస్తే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ మహిళగా నిలుస్తారు.
న్యూయార్క్ అసెంబ్లీకి ఫస్ట్ దక్షిణాసియా మహిళ
న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి జెన్నిఫర్ రాజ్‌కుమార్ అనే లాయర్ ఎన్నికయ్యారు. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు. డెమొక్రాట్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. రిపబ్లికన్ అభ్యర్థి జియోవనీ పెర్నాను ఓడించారు. 38వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె పోటీ చేశారు. న్యూయార్క్ సిటీకి ఆమె అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తారు. అంతకుముందు న్యూయార్క్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. లీగల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ శాంక్చువరీ ఫర్ ఫ్యామిలీస్‌లో లీగల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. గృహ హింస, సెక్స్ ట్రాఫికింగ్, జెండర్ వయొలెన్స్ బాధితులకు అండగా నిలుస్తూ.. వారి తరఫున పోరాడుతున్నారు. ఆమె పనితీరు నచ్చి న్యూయార్క్ రాష్ట్రానికి ఇమిగ్రేషన్ అఫైర్స్ అండ్ స్పెషల్ కౌన్సెల్‌కు డైరెక్టర్‌గా నియమించారు గవర్నర్ ఆండ్రూ క్యువోమో.
ఓటమి తప్పలె
కొన్ని చోట్ల డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీ చేసిన మనోళ్లకు ఓటమి తప్పలేదు. డెమొక్రాట్ పార్టీకి చెందిన ప్రెస్టన్ కులకర్ణి (42).. రిపబ్లికన్ క్యాండిడేట్ ట్రాయ్ నెల్స్ (52) చేతిలో ఓడిపోయారు. టెక్సస్‌లోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన పోటీ చేశారు. కులకర్ణికి లక్షా 75 వేల 738 (44%) ఓట్లు రాగా.. నెల్స్కు 2 లక్షల 4 వేల 537 (52%) ఓట్లు వచ్చాయి. మాజీ డిప్లొమాట్ అయిన కులకర్ణి.. ఇరాక్, రష్యా, ఇజ్రాయెల్, తైవాన్‌లో సేవలందించారు.
రిపబ్లికన్ నుంచి బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల.. డెమొక్రాట్ అభ్యర్థి జెర్రీ కానలీ చేతిలో ఓడిపోయారు. వర్జీనియాలోని 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేశారు.
మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగిన నిషా శర్మ 50 శాతానికిపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఆమెను డెమొక్రాట్ క్యాండిడేట్ మార్క్ డిశాల్నియర్ ఓడించారు.
న్యూ జెర్సీ సెనేట్ (ఎగువ సభ)కు పోటీ చేసిన రిపబ్లికన్ క్యాండిడేట్ రిక్ మెహతా ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ క్యాండిడేట్ సెనేటర్ కోరీ బుకర్ చేతిలో ఓడిపోయారు. మెహతాకు పది లక్షల 71 వేల 726 (37.9%) ఓట్లు పోలవగా.. బుకర్కు 17 లక్షల 14 వేల 375 (60.6%) ఓట్లు వచ్చాయి. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా మెహతా పనిచేశారు.