మహిళా శక్తి భవనాల పనులను 8 నెలల్లో పూర్తి చేయండి

  • మహిళా శక్తి భవనాల పనులను 8 నెలల్లో పూర్తి చేయండి
  • అధికారులకు సీఎస్​ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులు ప్రారంభించి, 8 నెలల్లో పూర్తి చేయాలని సీఎస్ శాంతికుమార్​ ఆదేశించారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం సంకల్పంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలతో బస్సుల కొనుగోలు, సోలార్ ప్లాంట్లు, శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ల ఏర్పాటు పనులను ముమ్మరం చేయాలని అన్నారు.  మహిళా శక్తి కార్యక్రమం అమలుపై గురువారం  పలు శాఖల అధికారులతో సీఎస్​ రివ్యూ చేపట్టారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దాదాపు 106 షాప్ లతో ఏర్పాటు చేస్తున్న ఈ బజార్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని,  వచ్చే నెల  మొదటి వారంలోగా ప్రారంభోత్సవానికి  ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  మహిళా సంఘాలతో బస్సులను కొనుగోలు చేయించి, వాటిని టీజీఎస్ ఆర్టీసీ ద్వారా నిర్వహించేందుకు ప్లాన్  రూపొందించాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి దశలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామని వివరించారు.