మిలియన్ డాలర్ల క్లబ్​లోకి మయాంక్‌‌!

మిలియన్ డాలర్ల క్లబ్​లోకి మయాంక్‌‌!
  • ఐపీఎల్ వేలానికి ముందు టీ20 అరంగేట్రంతో మారనున్న ఫ్యూచర్‌‌
  • నితీశ్ రెడ్డికి భారీ డిమాండ్‌ ఏర్పడే చాన్స్‌!

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌‌తో తొలి టీ20 మ్యాచ్‌‌లో  అరంగేట్రం చేసిన ఇండియా నయా పేస్ సెన్సేషన్‌‌ మయాంక్ యాదవ్​ ఐపీఎల్‌‌లో  మిలియన్ డాలర్ల  క్లబ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే సీజన్‌‌లో  లక్నో సూపర్ జెయింట్స్  మయాంక్‌‌ సేవలను నిలుపుకోవడానికి కనీసం రూ. 11 కోట్లు (1.31 మిలియన్ డాలర్లు) ముట్టజెప్పనుంది. బంగ్లాపైనే అరంగేట్రం చేసిన ఏపీ క్రికెటర్ నితీశ్‌‌ రెడ్డిని రిటైన్ చేసుకోవాలంటే  సన్‌‌రైజర్స్ హైదరాబాద్ అతనికి రూ.11 కోట్లయినా చెల్లించాల్సి ఉంటుంది. 

గత సీజన్‌‌లో అన్‌‌క్యాప్డ్‌‌ ప్లేయర్‌‌‌‌గా ఐపీఎల్‌‌లో ఆడిన ఈ ఇద్దరూ ఇప్పుడు టీమిండియా క్యాప్డ్‌‌ ప్లేయర్లుగా మారడమే ఇందుకు కారణం. ఐపీఎల్‌‌ రిటెన్షన్‌‌ నిబంధనల ప్రకారం వేలానికి ముందు  అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అన్‌‌క్యాప్డ్ ప్లేయర్..  క్యాప్డ్ ప్లేయర్  కేటగిరీకి వస్తాడు. తొలి ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్‌‌ల రిటెన్షన్ ధరలు వరుసగా  రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ,  రూ. 11 కోట్లుగా నిర్ధారించారు. నాలుగో ప్లేయర్‌‌‌‌కు తిరిగి రూ. 18 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 14 కోట్లుగా లెక్కగట్టారు.  

అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్‌‌ చేసుకున్న ప్లేయర్ల లిస్ట్‌‌ను ఈ నెల 31వ తేదీలోపు ప్రకటించాలి. గత సీజన్‌‌లో అద్భుతంగా బౌలింగ్‌‌ చేసిన నేపథ్యంలో లక్నో టీమ్‌‌ మయాంక్‌‌ను రిటైన్‌‌ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేఎల్ రాహుల్,  సౌతాఫ్రికా స్టార్ డి కాక్, వెస్టిండీస్ హిట్టర్‌‌‌‌ పూరన్, ఆస్ట్రేలియా ఆల్‌‌రౌండర్‌‌‌‌ స్టోయినిస్‌‌లను కూడా లక్నో విడిచిపెట్టే అవకాశం కనిపించడం లేదు. 

22 ఏండ్ల  మయాంక్‌‌ మూడో రిటెన్షన్ ప్లేయర్ అయినా కూడా రూ.11 కోట్లతో  అతను మిలియనీర్‌‌‌‌ అవ్వడం ఖాయం.  మయాంక్ వంటి అరుదైన బౌలర్‌‌ను లక్నో వదులుకునే చాన్స్‌‌ లేదని ఐపీఎల్‌‌ ఇన్‌‌సైడర్స్‌‌ చెబుతున్నారు. సన్‌‌ రైజర్స్‌‌లో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మ మొదటి మూడు రిటెన్షన్స్‌‌గా ఉండటం లాంఛనమే అనొచ్చు. ఈ నేపథ్యంలో నితీశ్‌‌ రెడ్డిని  వేలంలోకి పంపించి  రైట్ టు మ్యాచ్ (ఆర్‌‌‌‌టీఎం) కింద తీసుకునే చాన్సుంది.  ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నందున వేలంలో నితీశ్‌కు మంచి డిమాండ్ రావొచ్చు.