26 లిస్టెడ్ రియల్టీ కంపెనీల సేల్స్‌‌‌‌ 3 నెలల్లో 35 వేల కోట్లు

26 లిస్టెడ్ రియల్టీ కంపెనీల సేల్స్‌‌‌‌ 3 నెలల్లో 35 వేల కోట్లు
  • రూ. 5,198 కోట్లతో టాప్‌‌‌‌లో గోద్రెజ్‌‌‌‌ ప్రాపర్టీస్‌‌‌‌
  • క్యూ2లో భారీగా తగ్గిన డీఎల్‌‌‌‌ఎఫ్ ప్రీబుకింగ్స్‌‌‌‌
  • రెసిడెన్షియల్ సెగ్మెంట్‌‌‌‌లో కొనసాగుతున్న డిమాండ్‌‌‌‌

న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ కంపెనీల సేల్స్  రూ.వేల కోట్లలో జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ2) లో స్టాక్ మార్కెట్‌‌‌‌లో లిస్ట్‌‌‌‌ అయిన 26 రియల్ ఎస్టేట్ కంపెనీలు సుమారు రూ.35 వేల కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మాయి.  గోద్రెజ్ ప్రాపర్టీస్  ఎక్కువ అమ్మకాలు జరిపింది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫైల్ చేసిన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ప్రకారం,  రెసిడెన్షియల్ సెగ్మెంట్‌‌‌‌లో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. ఇందులో కూడా ప్రీబుకింగ్ సేల్స్ భారీగా పెరిగాయి.  సేల్స్‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్  టాప్‌‌‌‌లో నిలిచింది. 

ఈ కంపెనీ ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  రూ.5,198 కోట్ల విలువైన ప్రీసేల్స్ జరిపింది. లోధా బ్రాండ్‌‌‌‌ను ఆపరేట్ చేస్తున్న  ముంబై కంపెనీ  మాక్రోటెక్‌‌‌‌ డెవలపర్స్ లిమిటెడ్ రూ.4,290 కోట్ల విలువైన ప్రీబుకింగ్స్ సాధించింది. ఢిల్లీ కంపెనీ మ్యాక్స్ ఎస్టేట్‌‌‌‌ రూ.4,100 కోట్ల విలువైన ప్రాపర్టీలను, బెంగళూరు కంపెనీ ప్రెస్టీజ్‌‌‌‌ ఎస్టేట్ ప్రాజెక్ట్స్‌‌‌‌ రూ.4,022.6 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మగలిగాయి. గురుగ్రామ్‌‌‌‌లో హౌసింగ్ ప్రాజెక్ట్‌‌‌‌లకు డిమాండ్ పెరగడంతో సిగ్నేచర్ గ్లోబల్ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.2,780 కోట్ల విలువైన అమ్మకాలు సాధించింది. 

మార్కెట్ క్యాప్  పరంగా అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్‌‌‌‌ఎఫ్ లిమిటెడ్ సేల్స్ మాత్రం సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో పడ్డాయి. ఈ కంపెనీ కేవలం రూ.692 కోట్ల విలువైన ప్రాపర్టీలను మాత్రమే అమ్మగలిగింది.  కొత్త హౌసింగ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లను లాంచ్ చేయలేదు. ఇతర లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బెంగళూరు బేస్డ్ బ్రిగేడ్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ ఈ ఏడాది జులై–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 

రూ.1,821 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మగా, ముంబై కంపెనీ ఓబ్రాయ్‌‌‌‌ రియల్టీ రూ.1,442.46 కోట్ల ప్రీ సేల్స్‌‌‌‌ను సాధించింది. ఆదిత్య బిర్లా రియల్‌‌‌‌  ఎస్టేట్‌‌‌‌  రూ.1,412 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మగా,  బెంగళూరు కంపెనీ పూర్వాంకర లిమిటెడ్ రూ.1,331 కోట్లు, శోభ లిమిటెడ్ రూ.1,178.5 కోట్లను ప్రీబుకింగ్స్ ద్వారా పొందాయి.

ప్రీసేల్స్ తగ్గాయి..

చాలా లిస్టెడ్ కంపెనీల ప్రీసేల్స్‌‌‌‌  ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో తగ్గాయని ఎనలిస్టులు చెబుతున్నారు.   కొత్త ప్రాజెక్ట్‌‌‌‌లను లాంచ్ చేయడంలో అనుమతులు వేగంగా దొరకకపోవడం, అసాధారణ వర్షాలు, శ్రాద్ద కాలం కారణంగా డిమాండ్ తగ్గిందని వెల్లడించారు. ఉదాహరణకు డీఎల్‌‌‌‌ఎఫ్‌‌‌‌  ప్రీ సేల్స్‌‌‌‌ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.692 కోట్లకు పడిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌–జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ ప్రీ సేల్స్  రూ.6,404 కోట్లుగా రికార్డయ్యాయి.  పెంటప్ డిమాండ్ ఉండడంతో   కరోనా సంక్షోభం తర్వాత రెసిడెన్షియల్ సెగ్మెంట్ వేగంగా పుంజుకుందని రియల్ ఎస్టేట్ సెక్టార్ వర్గాలు చెబుతున్నాయి.  

కరోనా తర్వాత ఇండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. వినియోగదారులు కూడా ట్రాక్‌‌‌‌ రికార్డ్ బాగున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు, బ్రాండ్లకు మొగ్గు చూపుతున్నారు. కాగా,  మార్కెట్‌‌‌‌లో లిస్ట్ కాని రియల్ ఎస్టేట్ కంపెనీలు  తమ  సేల్స్  డేటాను, రిజల్ట్స్‌‌‌‌ను ప్రకటించాల్సిన అవసరం ఉండదు. అందువలన వీటి సేల్స్ డేటా అందుబాటులో లేదు. 

హైదరాబాద్‌‌‌‌లో తగ్గిన కొత్త లాంచ్‌‌‌‌లు..

ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లో ఇండ్ల అమ్మకాలు, కొత్త లాంచ్‌‌‌‌లు రెండూ భారీగా పడ్డాయి.  ప్రాప్‌‌‌‌ఈక్విటీ డేటా ప్రకారం,  సిటీలో కొత్త లాంచ్‌‌‌‌లో  కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జులై–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 54 శాతం తగ్గగా, సేల్స్ 42 శాతం పడ్డాయి. ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌‌‌‌లోనే ఇండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో సిటీలో 25,370 కొత్త ఇండ్లు లాంచ్ అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ 11,601 కి తగ్గింది. అమ్ముడైన ఇండ్ల సంఖ్య 20,658  యూనిట్ల నుంచి 12,082 కి పడింది.