న్యూఢిల్లీ: ద్రవ్యలోటు (ఖర్చులు మైనస్ రెవెన్యూ) పూర్తి ఏడాదికి పెట్టుకున్న టార్గెట్‌లో 8.1 శాతానికి జూన్ క్వార్టర్ (క్యూ1) లో చేరుకుంది. వాల్యూ పరంగా చూస్తే రూ.1,35,712 కోట్లుగా రికార్డయ్యిందని కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్స్ (సీజీఏ) పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో వేసుకున్న ద్రవ్యలోటు అంచనాల్లో 25.3 శాతానికి ఇది సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతానికి తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.
కిందటి ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 5.6 శాతంగా నమోదయ్యింది. వాల్యూ పరంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు టార్గెట్ 16,85,494 కోట్లకు సమానం. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ట్యాక్స్‌ల ద్వారా నికరంగా రూ.5,49,633 కోట్ల రెవెన్యూ (బడ్జెట్ అంచనాల్లో 21.1 శాతం) వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చులు రూ.9,69,909 కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 20.4 శాతం). ఇందులో రూ.1.81 లక్షల కోట్లను క్యాపిటల్ ఖర్చుల కోసం, రూ.2,64,052 కోట్లను వడ్డీలను చెల్లించడానికి వాడారు.