- 82 రన్స్ తేడాతో శ్రీలంకపై గెలుపు
- మెరిసిన మంధాన, షెఫాలీ, శోభన, అరుంధతి
దుబాయ్ : విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా చెలరేగిపోయింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 నాటౌట్), స్మృతి మంధాన (38 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) బ్యాట్లు ఝుళిపించడంతో.. బుధవారం జరిగిన గ్రూప్–ఎ మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 82 రన్స్ తేడాతో శ్రీలంకపై భారీ విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 172/3 స్కోరు చేసింది. హర్మన్, మంధానాకు తోడుగా షెఫాలీ వర్మ (40 బాల్స్‌లో 4 ఫోర్లతో 43) రాణించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 19.5 ఓవర్లలో 90 రన్స్‌కే కుప్పకూలింది. కావిషా దిల్హారి (21) టాప్ స్కోరర్. అరుంధతి రెడ్డి (3/19), ఆశా శోభన (3/19), రేణుకా సింగ్ (2/16) బౌలింగ్ ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
6 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన లంకను కావిషా, అనుష్క సంజీవని (20) నాలుగో వికెట్‌కు 37 రన్స్ జోడించి ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. మధ్యలో అమా కాంచన (19) కాసేపు పోరాడింది. 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్లే చేయడంతో లంక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. శ్రేయాంక, దీప్తి చెరో వికెట్ తీశారు. హర్మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా.. ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
‘టాప్’ లేపారు..
కీలకమైన మ్యాచ్ కావడంతో ఇండియా టాప్ ఆర్డర్ ఆరంభం నుంచే మెరుగ్గా ఆడింది. వికెట్లను కాపాడుకుంటూ వీలైనప్పుడల్లా రన్‌రేట్‌ను పెంచే ప్రయత్నం చేసింది. ఓపెనర్లు షెఫాలీ, స్మృతి మంధాన తొలి రెండు ఓవర్లు మెల్లగా ఆడినా క్రమంగా బ్యాట్లు ఝుళిపించారు. మూడో ఓవర్‌లో ఫోర్‌తో షెఫాలీ బ్యాట్‌కు పని చెప్పింది. తర్వాతి ఓవర్‌లో మరో బౌండ్రీతో టీ20ల్లో రెండు వేల రన్స్ మైలురాయిని అందుకుంది. ఆ వెంటనే మరో ఫోర్‌తో రెచ్చిపోయింది. ఆరో ఓవర్‌లో మంధాన కూడా బౌండ్రీలు బాదడంతో పవర్‌ప్లేలో ఇండియా 41/0 స్కోరు చేసింది.
7వ ఓవర్‌లో మంధాన సిక్స్‌తో జోరు పెంచింది. ఈ టోర్నీలో ఇండియా తరఫున ఇదే తొలి సిక్స్ కావడం విశేషం. ఇక్కడి నుంచి ప్రతి ఓవర్‌లో ఓ ఫోర్‌ను రాబట్టడంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా 78/0 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. అయితే ఛేంజ్ బౌలర్లుగా వచ్చిన కాంచన, కావిషా దిల్హారి రన్స్‌ను కట్టడి చేశారు. 13వ ఓవర్‌లో ఆటపట్టు బౌలింగ్‌లో సిక్స్‌తో మంధాన 36 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కానీ ఇదే ఓవర్‌లో వరుస బాల్స్‌లో మంధాన, షెఫాలీ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 98 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఈ దశలో వచ్చిన హర్మన్, జెమీమా రొడ్రిగ్స్ (16) వేగంగా ఆడారు. 7 రన్స్ వద్ద జెమీమా ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేసినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. 16వ ఓవర్‌లో హర్మన్ 4, 6తో రెచ్చిపోయింది. 17వ ఓవర్‌లో జెమీమా ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 30 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. వెంటవెంటనే హర్మన్ ఏడు ఫోర్లు కొట్టి 27 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకుంది. రిచా ఘోష్ (6 నాటౌట్)తో నాలుగో వికెట్‌కు 44 రన్స్ జత చేయడంతో ఇండియా భారీ స్కోరు చేసింది.