చెన్నైలో పుట్టి.. ఇంజనీరింగ్ చదివి.. క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న 38 ఏండ్ల రవిచంద్రన్ అశ్విన్ చిన్నప్పుడు అభద్రతాభావంతో సావాసం చేశాడు. కానీ, క్రికెట్‌లో మాత్రం తనో డేర్ డెవిల్. ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకొని క్రికెటర్‌గా రాటుదేలుతున్న కొద్దీ అతనిలో ఆత్మస్థయిర్యం పెరిగింది. ‘ఒకవేళ నేను ఒత్తిడిలో ఉంటే ప్రత్యర్థిని అంతకు ఐదు రెట్లు ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తా’ అని చెప్పే అశ్విన్ గ్రౌండ్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ తలొగ్గలేదు. జట్టు తలవంచకుండా తన శాయశక్తులా కృషి చేశాడు. ఒక క్రికెటర్‌గా అశ్విన్ ఎదిగిన తీరు అద్భుతం. ఇంజినీరింగ్‌తో చదువు ఆపేసిన అశ్విన్ నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. నిత్య విద్యార్థిగా నిరంతరం కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాడు.
తనను తాను మెరుగుపరుచుకోవడం కోసం నిత్యం మెదడుకు పదును పెడుతూ ప్రయోగాలు చేసి వాటితో జట్టుకు విజయాలు అందించాడు. ‘నేను సేఫ్ గేమ్ ఆడటం కంటే లైఫ్‌లో ఫెయిల్ అవ్వడానికి ఇష్టపడతాను. అది నా నైజం. నాలో ఎలాంటి అభద్రతా భావాలు లేవు’ అని తన ఆటో బయోగ్రఫీ ఫస్ట్ పాస్ట్ ‘ఐ హావ్ ది స్ట్రీట్స్’ రిలీజ్ సందర్భంగా చెప్పిన అశ్విన్ తన కెరీర్‌లో ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడలేదు. సగటు ఆఫ్ స్పిన్నర్ మాదిరిగా వికెట్ కోసం ‘దూస్రా’లపైనే ఆధారపడలేదు. తన ఆలోచనకు పదును పెట్టి ‘క్యారమ్ బాల్’ అనే కొత్త అస్ర్తాన్ని కనిపెట్టాడు. ఇది రైట్ హ్యాండ్ బ్యాటర్ల పాలిట సింహస్వప్నం అయింది. అయితే, చెన్నైలో ఓ జూనియర్ క్యాంప్ సందర్భంగా శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్‌ను చూసి దీన్ని నేర్చుకున్నానని చెప్పడం అశ్విన్ నిజాయితీకి నిదర్శనం.
మైండ్ మాస్టర్.. మ్యాచ్ విన్నర్
స్పిన్నర్ అంటే బంతిని గిర్రున తిప్పేసి వికెట్లు పడగొట్టే బౌలర్ కాదు.. ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసి.. అతని బలహీనతను గుర్తించి తప్పు చేసేలా ఉసిగొల్పి ఫలితం రాబట్టవచ్చని అశ్విన్ నిరూపించాడు. దాంతో మైండ్ మాస్టర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అశ్విన్‌కు టెస్టులు అంటేనే ఇష్టం. ఈ ఫార్మాట్‌లో అతనికి గొప్ప రికార్డు ఉంది. 2011లో ఢిల్లీలో వెస్టిండీస్‌పై అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధికంగా 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌లు గెలిచిన బౌలర్‌గా మురళీధరన్ సరసన నిలిచాడు. టెస్టుల్లో తను 37సార్లు ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ చేశాడు. ఎనిమిదిసార్లు 10 వికెట్ల హాల్స్ సాధించడం అతని సత్తాకు నిదర్శనం. మేటి జట్లపై అశ్విన్ మరింత మెరుగ్గా ఆడాడు. ఆస్ట్రేలియాపై 115 టెస్టు వికెట్లు సాధించిన అతను ఇంగ్లండ్‌పై 114 వికెట్లు పడగొట్టాడు. బోర్డర్-– -గావస్కర్ ట్రోఫీలో 115 వికెట్లు పడగొట్టాడు.
బ్యాట్‌తోనూ చాలా సందర్భాల్లో జట్టును ఆదుకొని అసలైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. టెస్టుల్లో అతను ఆరు సెంచరీలు, 14 ఫిఫ్టీలు చేశాడు. వీటిలో చాలా ఇన్నింగ్స్‌లు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆడినవే. ఇక, సొంత గడ్డపై టెస్టుల్లో అశ్విన్ అత్యంత ప్రభావం చూపెట్టాడు. జడేజాతో కలిసి స్వదేశంలో మ్యాచ్ విన్నర్‌గా మారాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలోనూ అశ్విన్ గొప్పగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2018లో ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ టెస్టుల్లో పొత్తి కడుపు గాయం వేధిస్తున్నా.. జట్టు కోసం చివరి వరకూ పోరాటం కొనసాగించాడు. 2021లో సిడ్నీ టెస్టులో జట్టుకు ఓటమి తప్పించేందుకు హనుమ విహారితో కలిసి 40 ఓవర్లు బ్యాటింగ్ చేయడం తన టెస్టు కెరీర్‌లో గుర్తుండిపోయే సందర్భం. వైట్-బాల్ క్రికెట్‌లోనూ అశ్విన్ సక్సెస్ అందుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో సభ్యుడైన రవిచంద్రన్ 2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో ఫైనల్లో చివరి ఓవర్లో 15 రన్స్‌ను డిఫెండ్ చేసి జట్టును గెలిపించాడు.
రూల్స్‌తోనే సమాధానం
అశ్విన్ క్రికెట్‌లోని రూల్స్‌ను పక్కాగా పాటిస్తాడు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేయాలని చూస్తే మాత్రం వాటితోనే సమాధానం చెబుతాడు. అందుకే తన బౌలింగ్‌లో నాన్ స్ట్రయికర్ ఎండ్ బ్యాటర్ ముందుగానే క్రీజు దాటితే ఏమాత్రం సంకోచించకుండా రనౌట్ (మన్కడింగ్) చేసేవాడు. ఈ విషయంలో ‘క్రీడా స్ఫూర్తి’ అనే వాదనను అశ్విన్ అస్సలు సమర్థించడు. క్రికెట్‌లోని రూల్స్‌ను అందరూ పాటించాల్సిందే అని చెప్పాడు. ఆటలోనే కాకుండా లైఫ్‌లోనూ అశ్విన్ వద్ద ఎప్పుడూ ప్లాన్–బి ఉంటుంది. క్రికెట్ తర్వాత జీవితంలో ఏం చేయాలనేదానిపై తనకు ఇప్పటికే ఓ అవగాహన ఉంది. అందుకే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ లీగ్, గ్లోబల్ చెస్ లీగ్‌లో ఒక్కో జట్టును కొనుగోలు చేశాడు. తమిళ్‌లో ‘కుట్టి స్టోరీస్’ అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. దానికి దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. మొత్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఐపీఎల్‌లో అతను మరికొన్నాళ్లు కొనసాగనున్నాడు. ఆటపై ప్రేమ, అద్భుత జ్ఞానం ఉన్నందున మున్ముందు అశ్విన్‌ను కోచ్‌గా కూడా చూడొచ్చు.
ఇండియా క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత అధ్యాయానికి తెరపడింది. మన‘స్పిన్ చంద్రుడు’ రవిచంద్రన్ అశ్విన్ తన ఆట ముగించాడు. 14 ఏండ్లుగా జట్టు స్పిన్ భారాన్ని మోస్తూ.. దిగ్గజాలు మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచిన అశ్విన్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేస్తూ అస్త్రసన్యాసం తీసుకున్నాడు. తన పనైపోయిందని ఎవ్వరూ వేలెత్తి చూపకముందే.. ఇంకా ఆడే సత్తా ఉన్నప్పుడే సగర్వంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
స్పిన్నర్ అంటే టర్నింగ్, ఫ్లాట్ వికెట్లపైనే ప్రభావం చూపుతారన్న ముద్రను చెరిపేస్తూ తన మైండ్ గేమ్‌తో అశ్విన్ చేసిన మ్యాజిక్.. క్యారమ్ బాల్‌తో బ్యాటర్లను వణికించిన తీరు..బ్యాటుతోనూ రాణించి టెస్టుల్లో అసలైన ఆల్‌రౌండర్‌గామెప్పించడం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.నిర్భయమైన ఆట.. నేర్చుకోవాలనే తపన.. ప్రయోగాలకువెనుకాడకపోవడం అశ్విన్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయి.
పర్ఫెక్ట్ క్యారమ్ బాల్ వేయడం నుంచి జట్టుకు అవసరమైన కీలక పరుగులు చేయడం వరకు, గెలవడానికి నువ్వు ఎప్పుడూ ఏదో ఓ మార్గాన్ని కనుగొంటావు. ప్రయోగాలు చేయడానికి, దాని నుంచి అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ భయపడకపోవడమే నిజమైన గొప్పతనం అని నీ ప్రయాణం చూపిస్తున్నది. నీ ఆట
అందరికి స్ఫూర్తినిస్తోంది. – సచిన్ టెండూల్కర్
నీతో కలిసి 14 ఏళ్లుగా ఆడుతున్నా. ఈ రోజు రిటైర్ అవుతున్నానని చెప్పినప్పుడు కాస్త భావోద్వేగానికి గురయ్యా. ఇన్నాళ్లూ కలిసి ఆడినప్పుడు కలిగిన గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నీతో చేసిన ప్రతి ప్రయాణాన్ని ఆస్వాదించా. ఇండియా క్రికెట్‌లో నీ నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ సహకారం మరువలేనిది.ఇండియన్ క్రికెట్‌లో నిన్నుఅందరూ లెజెండ్‌గా గుర్తుపెట్టుకుంటారు. – విరాట్ కోహ్లీ
కొన్నాళ్ల నుంచి అశ్విన్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు. తొలి టెస్టు అప్పుడే తన ఆలోచన చెప్పాడు. కానీ, పింక్ బాల్ టెస్టు ఆడేలా ఒప్పించాం. అశ్విన్ నిజమైన మ్యాచ్ విన్నర్. తన నిర్ణయాలను తానే తీసుకోగలడు. మనం దాన్ని గౌరవించాలి .కెప్టెన్ రోహిత్ శర్మ
దారి వదిలాడు
‘సిరీస్‌లో ప్రస్తుతం నా అవసరం లేకపోతే. నేను ఈ ఆట నుంచి తప్పుకోవడం మంచిది’ తన రిటైర్మెంట్ నిర్ణయానికి ముందు కెప్టెన్ రోహిత్‌తో అశ్విన్ చెప్పిన మాట ఇది. తన పనైపోయిందని చెప్పే అవకాశం అశ్విన్ ఎవ్వరికీ ఇవ్వలేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బౌలింగ్‌లో ప్రభావం చూపకపోవడంతో అశ్విన్ కెరీర్‌పై ప్రశ్నలు వచ్చాయి. కానీ, అప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ ఆలోచన చేయలేదు. అయితే, ఆస్ట్రేలియా టూర్‌లో తుది జట్టులో తనకు గ్యారంటీ లేదంటే అసలు ఆసీస్‌కు వచ్చే వాడినే కాదని టీమ్ మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేశాడు. కానీ, రోహిత్ గైర్హాజరీలో పెర్తు టెస్టులో ఇండియా అశ్విన్ బదులు సుందర్‌ను ఆడించారు. పింక్ టెస్టులో అశ్విన్ బరిలోకి దిగినా.. బ్రిస్బేన్‌లో జడేజాను తీసుకున్నారు. మిగిలిన రెండు టెస్టుల్లో తుది జట్టులో తనకు గ్యారంటీ లేదన్న విషయం తెలియడంతో పాటు తన వారసుడిగా సుందర్‌ను తీర్చిదిద్దుతున్నారని అర్థం చేసుకున్న అశ్విన్ తనంతట తానుగా తప్పుకున్నాడు. కనీసం సిరీస్ పూర్తయ్యే వరకూ కూడా వేచి చూడకుండా సుందర్ కోసం దారిని వదిలాడు.