భారత్ లో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు ఏడెనిమిది వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అయితే ఇందులో తొలి లక్ష కేసులు రావడానికి 110 రోజుల సమయం పట్టగా.. రెండో లక్ష కేసులు కేవలం 15 రోజుల్లోనే పెరిగాయి. దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఈ ఏడాది జనవరి 30న కేరళలో నమోదైంది. కరోనా పుట్టిన చైనాలోని వుహాన్ సిటీ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థి.. భారత్ లో తొలి కరోనా పాజిటివ్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరారు. అయితే దేశంలో దాదాపు 40 రోజుల పాటు పెద్దగా వైరస్ వ్యాప్తి లేదు. మార్చి 10 వరకు మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 50 మాత్రమే. ఆ తర్వాత క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తూ వచ్చింది. మే 18 నాటికి ఏకంగా లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే తొలి కేసు నమోదైన నాటి నుంచి కరోనా బారినపడినవారి సంఖ్య లక్షకు చేరడానికి 110 రోజులు పట్టింది. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య రెట్టింపయింది. జూన్ 2 రాత్రి కల్లా మరో లక్ష కేసులు పెరిగాయి.
పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మరణాల రేటు, కేసుల డబులింగ్ రేటు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే రికవరీ రేటు కూడా వేగంగా పెరుగుతోందని చెప్పింది. దేశంలో టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి రోజు లక్షకు పైగా టెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 40 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేశారు. అమెరికా, రష్యా, యూకే, స్పెయిన్ తర్వాత ఇంత భారీ సంఖ్యలో టెస్టులు చేసింది ఇండియానే.
చైనాలోని వుహాన్ సిటీలో గత ఏడాది డిసెంబరులో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 63 లక్షల మందికి పైగా సోకింది. దాదాపు 3.7 లక్షల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. అత్యధికంగా 18 లక్షల కేసులతో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ (5 లక్షలు), రష్యా (4 లక్షలు), యూకే (2.8 లక్షలు), స్పెయిన్ (2.4 లక్షలు), ఇటలీ (2.3 లక్షలు) దేశాలు ఉన్నాయి.