ముందు మీ దేశంలో మైనారిటీలను కాపాడండి మాకు నీతులు చెప్పవద్దు : రణ్​ధీర్  జైస్వాల్

ముందు మీ దేశంలో మైనారిటీలను కాపాడండి మాకు నీతులు చెప్పవద్దు : రణ్​ధీర్  జైస్వాల్
  • ముర్షిదాబాద్  హింసపై బంగ్లాదేశ్ కు భారత్  కౌంటర్

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింస విషయంలో బంగ్లాదేశ్  జోక్యం చేసుకోవడంపై భారత్  తీవ్రంగా స్పందించింది. ‘‘మీరు (బంగ్లాదేశ్) మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీ దేశంలో మైనారిటీలను, వారి హక్కులను కాపాడండి” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్​ధీర్  జైస్వాల్  కౌంటర్  ఇచ్చారు. బంగ్లాదేశ్ లో గత కొద్ది నెలలుగా మైనారిటీలపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని, ముందు ఆ దాడులకు ఫుల్ స్టాప్  పెట్టాలని ఆయన సూచించారు.

బెంగాల్ లో జరిగిన హింసలో ముస్లింలను బాధితులుగా చూపే ప్రయత్నం చేయవద్దని అన్నారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలు హింసకు గురవుతున్నట్లుగానే బెంగాల్ లోనూ మైనారిటీలపై దాడులు జరుగుతున్నట్లుగా బంగ్లాదేశ్  ప్రచారం చేసుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. కాగా.. ఈ నెల 8న బెంగాల్ లో చోటుచేసుకున్న అల్లర్లలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను బంగ్లాదేశ్  ఖండించింది.

బెంగాల్ లో ముస్లింలను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నామని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దీనికి కౌంటర్ గా బంగ్లాదేశ్ లో మైనారిటీలను కాపాడాలని రణ్ ధీర్  జైస్వాల్  ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, హింస జరిగిన ముర్షిదాబాద్ లో పర్యటిస్తానని బెంగాల్  గవర్నర్  సీవీ ఆనంద్  ప్రకటించారు.