- 2026 నాటికి జీడీపీలో ఐదో వంతు
- వెల్లడించిన ఆర్బీఐ
ముంబై: మనదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా జీడీపీలో ప్రస్తుతం పదో వంతు ఉందని, 2026 నాటికి ఇది జీడీపీలో ఐదవ వంతుకు చేరుకోనుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. డిజిటల్ఎకానమీ వేగంగా ఎదుగుతోందని తెలిపింది. ఇది 2023–-24 సంవత్సరానికి కరెన్సీ అండ్ ఫైనాన్స్ (ఆర్సీఎఫ్) పేరుతో రిపోర్టు విడుదల చేసింది. దీని ప్రకారం.. డిజిటల్ విప్లవంలో మనదేశం ముందువరుసలో ఉంది. డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం ద్వారా దేశం ఆర్థిక సాంకేతికతను (ఫిన్‌టెక్) విస్తరిస్తోంది.
బయోమెట్రిక్ గుర్తింపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ లాకర్స్, పర్మిషన్ ఆధారిత డేటా షేరింగ్ వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ విప్లవం వల్ల బ్యాంకింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు మెరుగుపడ్డాయి. వీటితో ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీలు, పన్ను వసూళ్లు మరింత సులువుగా మారాయి.
ఈ–కామర్స్ మార్కెట్లు ఎంతో అభివృద్ధి చెందాయి. మనదేశంలో నెట్వాడకం పెద్ద ఎత్తున పెరుగుతోంది. 2023లో భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి 55 శాతంగా ఉంది. ఇటీవలి మూడేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 19.9 కోట్ల మందికి పెరిగింది. డేటా ధర మిగతా దేశాల కంటే ఇండియాలోనే తక్కువగా ఉంది. ఫైనాన్స్‌లో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్‌కు మార్గం సుగమం చేస్తుందని, తక్కువ ఖర్చుతో ఆర్థిక సేవలను అందిస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రిపోర్టు కోసం రాసిన ముందుమాటలో పేర్కొన్నారు.
యూపీఐతో ఎంతో ప్రయోజనం
యూపీఐ సేవలు వినియోగదారులకు చెల్లింపులను సులువుగా మార్చేశాయి. లావాదేవీలను వేగంగా మరింత సౌకర్యవంతంగా చేయడం సాధ్యపడింది. ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఫలాలు అందుతున్నాయి. ఈ–-రూపాయి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీతో ఆర్బీఐ డిజిటల్‌విప్లవంలో చురుగ్గా ఉంది. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్‌మెంట్ నెట్‌వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్, సులువుగా లోన్లు పొందడానికి పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్ శక్తివంతంగా మారుతోంది.
ఫిన్‌టెక్‌లు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్‌బీఎఫ్‌సీ) పెద్ద ఎత్తున లోన్లు ఇస్తున్నాయి. డిజిటల్ క్రెడిట్‌ను సులభతరం చేయడానికి ఇవి ప్లాట్‌ఫారమ్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లుగా పనిచేస్తున్నాయి. లెండింగ్ ప్రొడక్టులకు మద్దతు ఇస్తున్నాయి. ఫలితంగా నిమిషాల్లో లోన్లు మంజూరు అవుతున్నాయి. ఇలాంటి ఇన్నోవేషన్ల ఫలితంగా ఆర్థిక మార్కెట్లు మరింత ఎదుగుతున్నాయని ఆర్బీఐ రిపోర్టు పేర్కొంది.