ట్రంప్​ టారిఫ్ ​వార్​తో ఎలక్ట్రానిక్స్​ ఇండస్ట్రీకి దెబ్బ

ట్రంప్​ టారిఫ్ ​వార్​తో ఎలక్ట్రానిక్స్​ ఇండస్ట్రీకి దెబ్బ
  • తయారీ ధరలు పెరిగే ప్రమాదం.. ఎగుమతులు తగ్గే చాన్స్​

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్​ డోనాల్డ్​ ట్రంప్ టారిఫ్ ​వార్‌‌తో మనదేశ ఎలక్ట్రానిక్స్​, సెమీకండక్టర్​ ఇండస్ట్రీకి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు వీటి ఎగుమతులు తగ్గుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటి​ధరలు, తయారీ ఖర్చు పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇండియాతోపాటు చైనాపై ప్రతీకార టారిఫ్​లు విధిస్తామని ట్రంప్​ ఈ నెల ఐదున ప్రకటించారు. ‘వాళ్లెంత సుంకం వేస్తే మేమూ అంతే వేస్తాం’ అంటూ కుండబద్దలు కొట్టారు. 

ఇండియా వాణిజ్య విధానాలనూ తప్పుబట్టారు. మనదేశాన్ని ‘టారిఫ్ ​కింగ్​’గా అభివర్ణించారు.  భారతదేశం నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల విలువ 30 బిలియన్ డాలర్లు కాగా, వీటిలో 60 శాతం స్మార్ట్‌‌‌‌ఫోన్ల నుంచే వస్తోంది. మూడింట రెండు వంతులు యాపిల్ ఐఫోన్లే ఉన్నాయి.   ఎలక్ట్రానిక్స్ తయారీలో గ్లోబల్ ​లీడర్​గా ఎదగాలని కోరుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి ట్రంప్​ నిర్ణయాలు ఎదురుదెబ్బేనని ఎనలిస్టులు అంటున్నారు.  ​అమెరికా సుంకాల పెంపు వల్ల మనదేశంలో స్మార్ట్‌‌‌‌ఫోన్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయమై ఒక ఎనలిస్టు మాట్లాడుతూ ‘‘అమెరికాతో తక్కువ సుంకాల కోసం మనదేశం చర్చలు జరపాలి. 

దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమను బలోపేతం చేయాలి. ప్రపంచ పెట్టుబడిదారులు ఇక్కడ వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయాలి. స్మార్ట్‌‌‌‌ఫోన్, చిప్ తయారీకి దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను అందించాలి. వియత్నాం, థాయ్​లాండ్​ వంటి దేశాలకు పరిశ్రమలు పోకుండా చూడాలి. మనదేశం తన పోటీ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. ఎలక్ట్రానిక్ ​ప్రొడక్టులపై ఇండియా సుంకాలను తొలగిస్తే ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చని ఇండియా సెల్యులార్​ అండ్​ ఎలక్ట్రానిక్స్ ​అసోసియేషన్ ​చైర్మన్ పంకజ్ మొహింద్రో కేంద్రానికి సూచించారు. 

ప్రయోజనాలూ లేకపోలేదు..

 టారిఫ్ ​వార్​ను మనకు అనుకూలంగా మలుచుకోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. తైవాన్‌కు చెందిన ఇసయ్యా రీసెర్చ్​లో సీనియర్​ ఎనలిస్ట్​ లోరీ చాంగ్​ స్పందిస్తూ భారీ సుంకాల వల్ల చైనా, మెక్సికో నుంచి కంపెనీలు ఇండియా బాట పట్టే అవకాశం ఉందని చెప్పారు. చైనా అసెంబ్లీ ప్లాంట్లను ఇండియాకు తరలించే అవకాశం ఉందని, కెమెరా మాడ్యూల్స్​, బ్యాటరీ సెల్స్​ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టవచ్చని చెప్పారు. యాపిల్​ ఇదివరకే ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టింది. 

ఐఫోన్లను ఇక్కడే తయారు చేస్తోంది.  ఐపాడ్స్​, ఐపోడ్స్​ను కూడా తయారు చేయనుంది.  ఇండియా ప్రస్తుతం సెమీకండక్టర్లను ఎగుమతి చేయకున్నప్పటికీ, దేశీయ మార్కెట్​ను బలంగా మార్చాలని హెచ్​సీఎల్​ కో–ఫౌండర్​ అజయ్​ చౌదరి అన్నారు. ఇలా చేయడం వల్ల టారిఫ్​లు పెరిగినప్పుడు డొమెస్టిక్​ మార్కెట్​ షాక్​ అబ్జార్బర్​లా పనిచేస్తుందని వివరించారు.