న్యూఢిల్లీ: ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), రిలేటెడ్ సెక్టార్లలో రూ.3.4 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి లోకల్, ఫారిన్ కంపెనీలు ముందుకొచ్చాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ కొలియర్స్ ఇండియా ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. వచ్చే ఆరేళ్లలో ఈ పెట్టుబడులు వస్తాయని తెలిపింది. కాగా, 2030 నాటికి అమ్ముడయ్యే మొత్తం బండ్లలో 30 శాతం ఈవీలు ఉండాలని, అంటే 8 కోట్ల ఈవీలు అమ్ముడు కావాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం ఇండియాలో అమ్ముడవుతున్న బండ్లలో ఈవీల వాటా కేవలం 8 శాతం మాత్రమే ఉంది.
ఇప్పటివరకు అమ్ముడైన ఈవీల మొత్తం సంఖ్య 50 లక్షల మార్క్‌ను దాటలేదు. ఈ ఏడాది 20 లక్షల ఈవీలు అమ్ముడవుతాయని అంచనా. ఇలానే కొనసాగితే ప్రభుత్వ టార్గెట్ చేరుకోవడానికి రానున్న ఆరేళ్లలో సేల్స్ ఏడాదికి సగటున ఆరు రెట్లు పెరగాల్సి ఉంటుందని, ఇది చేరుకోవడం కష్టమని కొలియర్స్ రిపోర్ట్ పేర్కొంది. ట్యాక్స్ రాయితీలు ఇస్తుండడంతో పాటు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేస్తే కరెంట్ బండ్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేసింది. పెట్రోల్, డీజిల్ బండ్ల రేట్లు, ఈవీ రేట్ల మధ్య తేడా తగ్గితే సేల్స్ పెరగొచ్చని పేర్కొంది.
ఈ రిపోర్ట్ ప్రకారం, ఇంకో ఆరేళ్లలో ఈవీ సెక్టార్‌లో 40 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.4 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామని చాలా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో 27 బిలియన్ డాలర్లను లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి, మరో 9 బిలియన్ డాలర్లను ఎక్విప్‌మెంట్లు, బండ్ల తయారీకి ఖర్చు చేయనున్నాయి.