న్యూఢిల్లీ: తయారీ రంగం కిందటి నెలలో పుంజుకుంది. అంతకు ముందు నెలలో ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయిన తయారీ రంగ పనితీరు, అక్టోబర్‌లో కోలుకుంది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ పనితీరును కొలిచే హెచ్‌ఎస్‌బీసీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో 56.5 గా రికార్డ్ కాగా, అక్టోబర్‌లో 57.5 కి పెరిగింది. పరిస్థితులు మెరుగయ్యాయనే విషయం అర్థమవుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. పీఎంఐ 50 కి పైన నమోదైతే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు.
కొత్త ఆర్డర్లు పెరిగాయని, కంపెనీల గ్లోబల్ సేల్స్ ఊపందుకున్నాయని హెచ్‌ఎస్‌బీసీ ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి అన్నారు. ఇండియాలో తయారైన ప్రొడక్ట్‌లకు డిమాండ్ పెరుగుతోందని, కొత్త మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వడంతో సేల్స్ పెరిగాయని చెప్పారు. కొత్త ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్ వస్తున్నాయని అన్నారు. రామెటీరియల్స్ ధరలు పెరగడంతో కిందటి నెలలో తయారీ కంపెనీలు ఇన్‌ఫ్లేషన్ సమస్యను ఎదుర్కొన్నాయి.