- శ్రీలంకతో ఇండియా తొలి టీ20 నేడు
- రాత్రి 7 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
పల్లెకెలె : కొత్త కోచ్, కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో టీ20 వరల్డ్ చాంపియన్ ఇండియా ఈ ఫార్మాట్‌లో సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ద్రవిడ్ స్థానంలో కోచింగ్ పగ్గాలు అందుకున్న గౌతమ్ గంభీర్, టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వచ్చిన సూర్యకుమార్ తొలి సిరీస్‌లోనే తమ మార్కు చూపెట్టాలని ఆశిస్తున్నారు. కోచ్‌గా ఎంపికైన వెంటనే హార్దిక్ పాండ్యాను కాదని టీ20 టాప్ బ్యాటర్ సూర్యకుమార్‌కు కెప్టెన్సీ అప్పగించిన గౌతీ ఇప్పటికే తన మార్కు చూపెట్టాడు.
ఇండియా, శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి ఈ మార్పు తీసుకొచ్చాడు. రోహిత్, కోహ్లీ, జడేజా వంటి సీనియర్లు టీ20ల నుంచి తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు వైట్ బాల్ ఫార్మాట్ల వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్ ఇదే మంచి అవకాశం. పేస్ లీడర్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఈ విభాగాన్ని నడిపించనున్నారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో చెత్తగా ఆడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన శ్రీలంక కొత్త కెప్టెన్ చరిత్ అసలంక నాయకత్వంలో సొంతగడ్డపై ఈ సిరీస్‌లో అయినా సత్తా చాటాలని కోరుకుంటోంది.