(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో 0–3తో వైట్‌వాష్ అయిన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతోంది. కివీస్ కొట్టిన దెబ్బతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనుకబడిన ఇండియాకు బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో కంగారూలపై విజయం అనివార్యం అయింది. ఐదు టెస్టుల సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుండగా.. అందుకు పది రోజుల ముందే టీమిండియా ఆసీస్ చేరుకొని జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. కానీ, రెండోసారి తండ్రయిన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయంతో శుభ్‌మన్ గిల్ పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు దూరం అవ్వడం జట్టును డీలా పడేసింది.
ఈ ఇద్దరి గైర్హాజరీలో టీమ్ కాంబినేషన్‌ను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే వారానికి పైగా ప్రాక్టీస్ సెషన్స్, మ్యాచ్ సిమ్యులేషన్స్‌లో ఆటగాళ్లంతా ముమ్మరంగా సాధన చేశారు. ఈ క్రమంలో తొలి టెస్టులో బరిలోకి దించాల్సిన టీమ్ కాంబినేషన్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టాండిన్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫామ్ కోల్పోయినప్పటికీ.. అనుభవం, టాప్, మిడిలార్డర్‌లో ఎక్కడైనా ఆడే టాలెంట్ ఉన్న కేఎల్ రాహుల్‌పై గంభీర్ నమ్మకం ఉంచాడు.
రోహిత్ స్థానంలో యశస్వి జైస్వాల్‌తో కలిసి అతనే ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. సీనియర్, గతంలో ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉన్న నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కూడా కేఎల్ వైపే మొగ్గు చూపుతోంది. మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన రాహుల్.. తన డిఫెన్స్‌పై ఫోకస్ పెట్టాడు. ఇక, రోహిత్‌కు రీప్లేస్‌మెంట్‌పై ముందునుంచే చర్చ జరగ్గా.. ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ గాయపడటం అనూహ్య పరిణామం. ఈ నేపథ్యంలో ఇండియా–ఎ టీమ్ తరఫున ఆసీస్ టూర్‌కు వెళ్లిన దేవదత్ పడిక్కల్‌ను మేనేజ్‌మెంట్ అక్కడే ఉంచింది. గిల్ ప్లేస్‌లో పడిక్కల్ వన్‌డౌన్‌లో ఆడే చాన్సుంది.
నెట్ సెషన్‌లో అతను కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఆస్ట్రేలియా–ఎతో అనధికార టెస్టులో అతను రాణించాడు. మకేలో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగో నంబర్‌లో ఆడిన అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 276 బాల్స్ ఎదుర్కొని 124 రన్స్ చేశాడు. కానీ, ఎంసీజీలో బౌన్సీ పిచ్‌పై ఐదో నంబర్‌లో వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ రూపంలో మరో ఆప్షన్ కూడా మేనేజ్‌మెంట్ ముందుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తను తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఆరో నంబర్ కోసం జురెల్x సర్ఫరాజ్
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ 4, 5వ నంబర్లలో ఆడనున్నారు. మిడిలార్డర్‌లో ఆరో ప్లేస్ కోసం సర్ఫరాజ్ ఖాన్, కీపర్ ధ్రువ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది. న్యూజిలాండ్‌పై సర్ఫరాజ్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ తొలి టెస్టులో అతనికి చాన్స్ దక్కకపోవచ్చు. ప్రాక్టీస్, నెట్ సెషన్స్‌లో జురెల్ మెరుగ్గా కనిపించడమే అందుకు కారణం. పెర్త్ మెయిన్ గ్రౌండ్‌లో జరిగిన నెట్ సెషన్‌లో రైజింగ్ బాల్స్‌ను జురెల్ సమర్థవంతంగా ఎదుర్కొంటూ కనిపించాడు. ఏ బంతిని ఆడాలి? దేన్ని వదిలేయాలి? అనే విషయంలో మంచి క్లారిటీతో ఉన్నాడు. పైగా ఇండియా–ఎ తరఫున మెల్‌బోర్న్‌లో సీమింగ్ కండిషన్స్‌లో రెండు ఫిఫ్టీలు కొట్టడం అతనికి ప్లస్ పాయింట్ కానుంది.
పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ రెడ్డి
మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ కోచ్‌మోర్నె మోర్కెల్ తన సమయాన్ని తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి కోసమే కేటాయించాడు. అంపైర్ పొజిషన్‌లో నిలబడి నితీష్ విసిరిన బాల్స్‌ను చూశాడు. వెనకాల నుంచి అతని రనప్‌ను కూడా పరిశీలించాడు. మంచి వేగంతో బంతులు వేయడమే కాకుండా నాణ్యమైన పేసర్ మాదిరి రనప్‌తో నితీష్ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అవసరం అయితే బౌలింగ్ కూడా చేసే ఆల్‌రౌండర్‌గా నితీష్ ఆసీస్ గడ్డపై టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో శార్దూల్ ఠాకూర్ ఈ బాధ్యతను తీసుకున్నాడు. ఇక, ఆసీస్ జట్టులోని కీలక ఆటగాళ్లు ఖవాజా, హెడ్, క్యారీ లెఫ్టాండర్లు కావడంతో మెయిన్ స్పిన్నర్‌గా అశ్విన్ బరిలోకి దిగడం ఖాయమే. మరో స్పిన్నర్ కావాలనుకుంటే జడేజా, సుందర్‌లో ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారనుంది. ఇక, స్టాండిన్ కెప్టెన్, పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి పేస్ బాధ్యతలు ఎవరు పంచుకుంటారన్నదానిపైనే స్పష్టత రావాల్సి ఉంది. గత ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ న్యూజిలాండ్‌పై తేలిపోయాడు.
అదే సమయంలో టెస్టు టీమ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆకాశ్ దీప్ సత్తా చాటుతున్నాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ప్రసిధ్ కృష్ణ రీఎంట్రీ కోసం తహతహలాడుతుండగా.. 22 ఏండ్ల యంగ్ పేసర్ హర్షిత్ రాణాను గంభీర్ సర్‌ప్రైజ్ బౌలర్‌గా బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. ప్రసిధ్, హర్షిత్‌లో ఒకరు తుది జట్టులోకి రావాలంటే సిరాజ్, అకాశ్ దీప్‌లో ఎవరిని తప్పిస్తారో చూడాలి.