అటూ ఇటూ సముద్రం.. మధ్యలో పట్టాలపై పరుగులు తీసే రైలు. దేశంలోని మొట్టమొదటి సముద్ర వంతెన పంబన్ బ్రిడ్జిపై కనిపించే అద్భుత దృశ్యమిది. 2.1 కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనపై 15 నిమిషాల పాటు సాగే ప్రయాణం అడ్వెంచర్ను తలపిస్తుంది. లైఫ్లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారు ఒక్కసారైనా ఈ బ్రిడ్జిపై ప్రయాణం చేయాల్సిందే. ఆ మధురానుభూతిని మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవాల్సిందే.
పంబన్ ద్వీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరానికి ఈ బ్రిడ్జి మీదుగానే రైలు ప్రయాణం సాగుతుంది. సముద్రంలో 143 పిల్లర్లు వేసి నిర్మించిన ఈ రైల్వే వంతెన ఓ ఇంజనీరింగ్ అద్భుతం. పంబన్ ద్వీపాన్ని తమిళనాడుతో కలిపే ఈ బ్రిడ్జి దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర వంతెన. వర్తక వాణిజ్యాల కోసం 1870లో బ్రిటీషర్లు ఈ వంతెన నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 1911 ఆగస్టులో నిర్మాణం ప్రారంభం కాగా.. 1914 ఫిబ్రవరి 24న అందుబాటులోకి వచ్చింది. పంబన్ వంతెన నిర్మించి వందేళ్లు దాటినా.. ఇప్పటికీ నిర్మాణం చెక్కు చెదరలేదు. పాక్ జలసంధిపై ఈ రైల్వే వంతెన ఉండటంతో ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మధ్య భాగం రెండుగా విడిపడేలా ఈ బ్రిడ్జ్ను డిజైన్ చేశారు.
పంబన్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక తొలుత తమిళనాడులోని మండపం నుంచి పంబన్కు మీటర్ గేజ్ రైలు నడిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చొరవతో 2007లో దాన్ని బ్రాడ్ గేజ్గా మార్చారు. పంబన్ నుంచి ఈ రైల్వే లైన్ రెండుగా విడిపోతుంది. అందులో ఒకటి రామేశ్వరం, మరొకటి ధనుష్కోడికి వెళ్తుంది. 1964 వరకు మద్రాస్ ఎగ్మోర్ నుంచి రామేశ్వరం మీదుగా ధనుష్కోడి వరకు బోట్ మెయిల్ ఎక్స్ప్రెస్ నడిచేది. 1964లో వచ్చిన తుఫానులో బ్రిడ్జి డ్యామేజ్ కాగా.. 46 రోజుల్లోనే రిపేర్ చేసి అందుబాటులోకి తెచ్చారు. 2013లో పంబన్ బ్రిడ్జిని ఓ భారీ నౌక ఢీకొట్టగా పిల్లర్ల జాయింట్లు స్వల్పంగా దెబ్బతినడం మినహా ఎలాంటి నష్టం జరగలేదు. ఉప్పు నీటి కారణంగా బ్రిడ్జి తప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు రంగులు వేస్తుంటారు.