శ్రీవల్లి రష్మిక జోరు.. బిల్లీ జీన్‌‌ కింగ్‌‌ కప్‌‌ టెన్నిస్ టోర్నీలో ఇండియా తొలి గెలుపు

శ్రీవల్లి రష్మిక జోరు.. బిల్లీ జీన్‌‌ కింగ్‌‌ కప్‌‌ టెన్నిస్ టోర్నీలో ఇండియా తొలి గెలుపు

పుణె: హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ముందుండి నడిపించడంతో బిల్లీ జీన్‌‌ కింగ్‌‌ కప్‌‌ టెన్నిస్ టోర్నమెంట్‌‌లో ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ తొలి విజయం అందుకుంది. ఆసియా ఓసియానియా గ్రూప్‌‌-–1 మొదటి పోరులో న్యూజిలాండ్ చేతిలో పరాజయం నుంచి వెంటనే పుంజుకున్న ఇండియా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌‌లో 2–1తో థాయ్‌‌లాండ్‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

మెగా టోర్నీలో శ్రీవల్లి  వరుసగా రెండో విక్టరీతో ఆకట్టుకుంది. ప్రపంచ 345 ర్యాంకర్ అయిన హైదరాబాదీ శ్రీవల్లి  6–2, 6–4తో తనకంటే ఎంతో మెరుగైన 170 ర్యాంకర్ లన్లానా తరారుడీపై సంచలన విజయంతో జట్టుకు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో సింగిల్స్‌‌లో మరో తెలుగమ్మాయి యమలపల్లి సహజ 3–6, 7–6 (7/3), 0–1తో ఉన్న దశలో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌‌ అయింది. దాంతో థాయ్‌‌లాండ్ 1–1తో స్కోరు సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌‌లో అంకిత రైనా–ప్రార్థన తోంబరే  7–6, 3–6, 10–3తో   సూపర్ టై బ్రేక్‌లో థాసపొర్న్‌‌–ప్లిపుయెచ్‌‌ను ఓడించడంతో ఇండియా గెలిచింది. గురువారం జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో ఇండియా పోటీ పడనుంది.