ప్రపంచంలో మనదే బెస్ట్ ఫుడ్: లివింగ్ ప్లానెట్ రిపోర్టులో వెల్లడి

ప్రపంచంలో మనదే బెస్ట్ ఫుడ్: లివింగ్ ప్లానెట్ రిపోర్టులో వెల్లడి
  • హెల్దీ, పర్యావరణానికి అనుకూలం

న్యూఢిల్లీ:  ప్రపంచ దేశాల(జీ20)తో పోలిస్తే మనం తినే ఫుడ్ చాలా బెటరని ఓ నివేదికలో తేలింది. ఇండియా ప్రజలు తినే ఆహారం శరీరానికి మంచి చేయడంతో పర్యావరణానికి కూడా హాని చేయని విధంగా ఉంటుందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ రిలీజ్ చేసిన ‘లివింగ్ ప్లానెట్ రిపోర్ట్’లో వెల్లడైంది. ఇండియన్లు తినే ఫుడ్ ను మిగతా దేశ ప్రజలు కూడా తింటే 2050 నాటికి భూమికి, వాతావరణానికి చాలా మేలు జరుగుతుందని తెలిపింది. అమెరికా, అర్జెంటినా, ఆస్ట్రేలియా ఫుడ్ చెత్త ర్యాంకింగ్ ‌‌ ను  నమోదు చేసిందని చెప్పింది.

ఆయా దేశాల ప్రజలు ఎక్కువగా కొవ్వు, చక్కెర పదార్థాలతో కూడిన ఫుడ్ తింటారని.. దానివల్ల  2.5 బిలియన్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని నివేదిక హెచ్చరించింది. ఆయా దేశాల్లో 890 మిలియన్ల మంది ఒబెసిటీతో జీవిస్తున్నారని పేర్కొంది.  ఇలాంటి ఫుడ్ శరీరంతో పాటు వాతావరణానికి చాలా హానికరమని తెలిపింది. 

మన ఫుడ్ ఎందుకు బెటరంటే.. 

ఇండియన్లు  వెజ్, నాన్ వెజ్ తీసుకుంటారు. నార్త్ ఇండియన్లు పప్పులు,  గోధుమ రొట్టెలతో పాటు మాంసం ఆధారిత ఆహార పదార్థాలను తింటారు. సౌత్ ఇండియన్లు అన్నం, ఇడ్లీ, దోశ, సాంబార్ వంటివి ఎక్కువగా తింటున్నారు. ఇక వెస్ట్, ఈస్ట్, ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు కాలానుగుణంగా లభించే చేపలను అన్నంతో పాటు ప్రధాన ఆహారంగా తీసుకుంటారు.  బార్లీ, రాగులు, జొన్నలు, మిల్లెట్లను కూడా తీసుకుంటారు.

అందుకే ఈ ఫుడ్ చాలా మంచిదని నివేదిక తెలిపింది. అన్ని దేశాలు భారతదేశం మాదిరిగానే ఆహార పద్ధతిని అవలంబిస్తే 2050 నాటికి వాతావరణం మెరుగవుతుందని పేర్కొంది. అలాగే జీవవైవిధ్యం, సహజ వనరులు, ఆహార భద్రతకు ప్రమాదం   ఉండదని చెప్పింది. స్థానిక, కాలానుగుణ ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరంపై దృష్టి పెట్టాలని రిపోర్ట్ సూచించింది. ప్రాసెస్ చేసిన ఆహారాలు తక్కువగా తీసుకోవాలని..శాకాహారం తింటూ ఆహార వృధాను తగ్గించాలని కోరింది.